Power Bills Issue : `ప‌వ‌ర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్‌

ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల‌పై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించిన‌ప్ప‌టికీ రూ. 6వేల కోట్ల‌కు పైగా ఇవ్వాల్సిన బ‌కాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ స‌ర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజ‌కీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నిక‌ల్లో తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించినా ఆశ్చ‌ర్యంలేదు.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 02:15 PM IST

ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల‌పై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించిన‌ప్ప‌టికీ రూ. 6వేల కోట్ల‌కు పైగా ఇవ్వాల్సిన బ‌కాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ స‌ర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజ‌కీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నిక‌ల్లో తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించినా ఆశ్చ‌ర్యంలేదు. సెంటిమెంట్ ను న‌మ్ముకున్న కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు. అదే సెంటిమెంట్ తో మూడోసారి సీఎం కావ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేశారు. ఆ క్ర‌మంలో ఇటీవ‌ల నిర్వ‌హిస్తోన్న జిల్లాల‌వారీగా స‌భ‌ల్లోనూ కృష్ణా నీళ్ల వాట‌ను ప్ర‌స్తావిస్తున్నారు.

వాస్త‌వంగా ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ స‌హ‌జ మిత్రులుగా ఉన్నారు. రాజ‌కీయంగానూ ఇద్ద‌రూ క‌లివిడిగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల మోడీతో ఢీకొంటోన్న కేసీఆర్ కు దూరంగా ఉన్న‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌జ మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. అందుకే, ఇరు రాష్ట్రాల స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వ్యూహాత్మ‌క మౌనం ఇద్ద‌రూ వ‌హిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ బ‌కాయిల విష‌యంలో క్విడ్ ప్రో కో వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌న పెడుతోన్న కేసీఆర్, జ‌గ‌న్ లు సెంటిమెంట్ ను రాజేసే దిశ‌గా అడుగులు వేస్తున్నట్టు క‌నిపిస్తోంది.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం చాలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా కేంద్రం వ‌దిలేసింది. వాటిల్లో రాజ‌ధాని, విశాఖ రైల్వే, పోల‌వ‌రం, ఆర్థిక లోటు, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజి, పార్ల‌మెంట్ వేదిక‌గా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీ త‌దిత‌రాలు ఉన్నాయి. వాటిని పెద్ద‌గా సాధించుకోలేక‌పోయిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బ‌కాయిలు రూ. 6వేల కోట్ల గురించి ప్ర‌స్తావించ‌డం సెంటిమెంట్ రాజేసే కేసీఆర్ కు కలిసొచ్చే అంశం. సీఎం అయిన వెంట‌నే జ‌రిగిన మొద‌టి మీటింగ్ లో హైద‌రాబాద్ లోని ఏపీ స‌చివాల‌య భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు జ‌గ‌న్ వ‌దిలేశారు. ఆ త‌రువాత గోదావ‌రి నీళ్ల ఇష్యూలోనూ క్విడ్ ప్రో కో కోణం నుంచి చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ, విద్యుత్ బ‌కాయిల‌ను మూడేళ్ల త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు లేవ‌దీయ‌డం గ‌మ‌నార్హం.

జ‌న్ కో సంస్థ‌కు బకాయిపడిన సొమ్మును వడ్డీ సహా ఏపీకి చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ సంస్థలు రూ.12,941 కోట్లు చెల్లించాల్సి `రివ‌ర్స్ `యాంగిల్ దాడిని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పడంతోనే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిందని ప్ర‌తిదాడికి దిగారు. మోదీకి ఏపీ రాసిన లేఖలు తప్ప తెలంగాణ లేఖలు కనిపించడం లేదని రాజ‌కీయ కోణాన్ని తీశారు. నెల రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించడం దుర్మార్గమని సానుభూతి కోసం ప్ర‌య‌త్నించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం ఇలానే వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపిస్తూ ఇరురాష్ట్రాత మ‌ధ్య సెంటిమెంట్ , మోడీపై వ్య‌తిరేక‌త‌ను ఒకేసారి ప్లే చేయ‌డం ద్వారా మూడోసారి సీఎం పీఠం కోసం టీఆర్ఎస్ ఎత్తుగ‌డ వేసింది.

ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు గాను చెల్లించాల్సిన రూ. 3,441.78 కోట్లతోపాటు, చెల్లింపులో జరిగిన జాప్యానికి సర్‌చార్జ్ రూ.3,315.14 కోట్లు (31 జులై 2022 వరకు) కలిపి మొత్తంగా రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అంతేకాదు, ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నిబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని పేర్కొన్న కేంద్రం విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం బకాయిలు చెల్లించాల‌ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విభజన వివాదాలతో ముడిపెట్ట‌కుండా 30 రోజుల్లో బకాయిలను చెల్లించాల్సిందేనని తేల్చేసింది. ఈ ప‌రిణామాన్ని అనుకూలంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీం మ‌లుచుకుంటోంది.

తెలంగాణ మ‌రోలా వాదన వినిపిస్తూ విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ పరిధిలోని కేంద్రీయ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్నాయని చెబుతోంది. ఆ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు విద్యుత్ సంస్థలు రుణాలు తీసుకున్నాయని రివ‌ర్స్ యాంగిల్ లో వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు, ఈ రుణాల చెల్లింపునకు తీసుకున్న మొత్తం రూ.12,941 కోట్లు ఉంటుందని, ఈ లెక్కన ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవే ఎక్కువని, కాబట్టి ఏపీకి బకాయిలు చెల్లించే ప్రశ్నే లేదని సెంటిమెంట్ రెచ్చ‌గొట్ట‌డానికి బీజం వేశారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. మొత్తం మీద ఎన్నిక‌ల వేళ ఆంధ్రా సెంటిమెంట్ ను మ‌రోసారి ప్లే చేయ‌డానికి టీఆర్ఎస్ సిద్ధం అయింది. అందుకు ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇష్యూల‌ను ఢిల్లీ కేంద్రంగా లేవ‌నెత్తుతూ ర‌క్తిక‌ట్టిస్తున్నారని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

స‌హ‌జ మిత్రులుగా ఉన్న కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2023, 2024 ఎన్నిక‌ల్లోనూ క్విడ్ ప్రో కో దిశ‌గా ఇరు రాష్ట్రాల మ‌ధ్య పెండింగ్ లో ఉన్న ఇష్యూల‌ను లేవ‌నెత్తుతార‌ని అర్థం అవుతోంది. అందుకు విద్యుత్ బ‌కాయిల చెల్లింపు తొలి బీజం మాత్ర‌మేన‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద రాజ‌కీయ కోణం నుంచి ఈ ఇష్యూను ర‌క్తిక‌ట్టించ‌నున్నార‌ని టీఆర్ఎస్ వాద‌న ఆధారంగా స్ప‌ష్టంగా తెలుస్తోంది.