Site icon HashtagU Telugu

YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సంచలన పరిణామం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

Ys Vivekananda Reddy Cbi 1

Ys Vivekananda Reddy Cbi 1

YS Vivekananda Reddy: దివంగత నేత, కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందుగానే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. గతంలో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి కోరగా.. కొన్ని రోజుల పాటు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని సీబీఐకు హైకోర్టు సూచించింది. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని గతంలో హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే వివేకా హత్య కేసులో పలుమార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.

గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలోనే ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను కూడా ప్రశ్నించగా.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్లు సీబీఐ తేల్చింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని ఏ క్షణంలోనైనా సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. సోమవారం సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేసు విచారణ నెమ్మదిగా జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని, రాజకీయ వైరం అని మాత్రమే ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును ఇంకా ఎంతకాలం విచారిస్తారని, హత్యకు గల ప్రధాన కారణాలు బయటపెట్టాలని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుుంది.

Exit mobile version