Site icon HashtagU Telugu

Rayalaseema State: ఏపీలో `ప్రత్యేక రాష్ట్ర` ఉద్యమం షురూ

tirumala

tirumala

అమరావతి , మూడురాజధానులు మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్ళీ పురుడు పోసుకుంటుంది. ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ రాయలసీమను గుర్తించాలని సరికొత్త డిమాండ్ తెరమీదకు దూసుకొస్తోంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమ ను ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే నినాదం ఊపందుకుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా చేయడానికి దూకుడుగా వెళ్తున్న క్రమంలో నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని రాయలసీమకు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు తిరుపతి రాజధానిగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర డిమాండ్ ను వినిపిస్తున్నారు. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమ కోసం ప్రతాప్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ రాయలసీమకు చెందిన వారైనప్పటికీ ఈ ప్రాంతాన్ని విస్మరించారని విమర్శించారు.

Also Read:  MODI VIZAG TOUR : నవంబర్ 11న విశాఖకు రానున్న ప్రధానమంత్రి మోదీ..!!

గ్రేటర్ రాయలసీమకు రాష్ట్ర హోదా కోసం మద్దతును సమీకరించడానికి నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రతాప్ రెడ్డి పలు విషయాలను మీడియాతో షేర్ చేశారు. 2020లో ప్రారంభించిన తమ ఆందోళన రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రభావితమైందని వివరించారు. శరవేగంగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో ఉండటం, చెన్నై, బెంగళూరు నగరాలకు సమీపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉండడంతో తిరుపతి రాజధానిగా అనువైనదని ఆయన అన్నారు.

1937లో రాయలసీమ, కోస్తా ఆంధ్ర రాజకీయ నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమలో, హైకోర్టు కోస్తా ఆంధ్రలో ఉండాలనే ఆ ఒప్పందాన్ని విస్మరించారని ప్రతాపరెడ్డి ఆరోపించారు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఏపీని విభజించిన తర్వాత తొలి రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేసినా, తర్వాత హైదరాబాద్‌కు మార్చారు. గ్రేటర్ప్ర రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రజలందరూ తమ పోరాట యాత్రలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద రాజధానుల పోరులో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సరికొత్తగా పురుడు పోసుకోవడం ఏపీ రాజకీయాల్లో హైలైట్ గా నిలుస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.

Also Read:   AP 3 Capitals in Supreme Court: 3 పై 1న “సుప్రీం” డైలమా