Violence@Konaseema: కోనసీమ అల్లర్లకు అసలు బాధ్యులు ఎవరు? చరిత్ర తెలిసి కూడా సర్కారు జాగ్రత్తపడలేదా?

కోమసీమలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని ముందే హెచ్చరించడంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు విఫలమయ్యారు?

  • Written By:
  • Updated On - May 28, 2022 / 12:45 PM IST

కోమసీమలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని ముందే హెచ్చరించడంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు విఫలమయ్యారు? మంత్రి ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు తగలబెడుతున్నా పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోయారు? వేలాదిమంది నిరసనకారులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నా, విధ్వంసకాండకు తెగబడుతున్నా పోలీసులు దానిని అడ్డుకోలేకపోయారు. అవసరమైతే అదనపు బలగాలను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేగంగా రప్పించవచ్చు.

కానీ ఆ చర్యలను వెంటనే ఎందుకు చేపట్టలేకపోయారు? ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అల్లర్ల వెనుక ఉన్నది ఎవరు అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. కానీ ఆలోపే అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది. దీనికి మీరు బాధ్యులంటే మీరు బాధ్యులంటూ విమర్శించుకుంటున్నారు. దీనివల్ల వారికెంత నష్టం జరిగిందో.. సామాన్యుడికి అంతకంటే ఎక్కువ నష్టమే జరిగింది అన్నది నూటికి నూరుపాళ్లూ నిజం.

కోస్తాలో సామాజికవర్గాల మధ్య ఘర్షణలు మామూలుగానే ప్రారంభమైనా అవి తీవ్రరూపం దాల్చే ప్రమాదముంది. ఆ ప్రాంత చరిత్ర చూస్తే అర్థమవుతోంది. కారంచేడు ఘటనను చరిత్ర నుంచి చెరిపేయలేం. దక్షిణకోస్తాలో.. అందులోనూ కోనసీమలో ఇలాంటి ఘర్షణల చరిత్ర ఉన్నప్పుడు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. విధ్వంసానికి ముందు రెండు వర్గాల సోషల్ మీడియా క్యాంపైన్ ను విశ్లేషించి దానికి అనుగుణంగా చర్యలను తీసుకున్నా.. ఈ దుర్ఘటనను ఆపడానికి అవకాశం ఉండేది.

ఇతర జిల్లాలకు నాయకుల పేర్లు పెట్టినప్పుడే ప్రభుత్వం కోనసీమకు కూడా అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. మరి ప్రతిపక్షాలు అంతే బాధ్యతతో వ్యవహరించాయా? ఒక వర్గం నుంచి డిమాండ్ వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. తరువాత పరిస్థితి తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు స్పష్టంగానే ఉంది. జిల్లాకు పెట్టిన అంబేద్కర్ పేరును వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదని చెప్పేసింది. మరి విపక్షాలు ఎందుకు తమ వైఖరిని సుస్పష్టంగా చెప్పడం లేదు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి కీలకమైన సమయంలో రాజకీయాలకు తావులేకుండా కోనసీమలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు అందరిపైనా ఉంది.