ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డలో `రైతు భరోసా` బటన్ నొక్కారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే `పీఎం కిషాన్ సమ్మాన్ ` సహాయం రూ. 2వేలు రైతుల ఖాతాల్లో పడింది. ముందుగా కేంద్రం చెప్పిన విధంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఆ నిధులను విడుదల చేసింది. కిసాన్. సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ 12వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో మధ్నాహ్నం 12 గంటల వరకు రూ. 2వేల రైతుల ఖాతాల్లో జమ అయింది. సరిగ్గా అదే సమయంలో జగన్ బటన్ నొక్కారు. కానీ, ఆయన విడుదల చేసిన డబ్బు మాత్రం రైతుల ఖాతాల్లోకి రాలేదు.
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత చెల్లింపులకు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ కంప్యూటర్‌లో బటన్ నొక్కారు. అదే సమయంలో పీఎం కిసాన్ మూడవ విడత చెల్లింపులను ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. పై రెండూ కలిపి మొత్తం 50.92 లక్షల మంది రైతులకు రూ.4 వేలు చొప్పున రూ.2,096.04 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఈ పథకం వరుసగా నాలుగో ఏడాది అమలవుతోంది. కాగా, ఈ ఏడాది మే నెలలో తొలివిడతగా రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన జగన్ ప్రభుత్వం నేడు రెండో విడత సందర్భంగా రూ.4 వేల చొప్పున బదిలీ చేసినట్టు చెబుతోంది.
Also Read: Pawan Kalyan Warns: మూడు పెళ్లిళ్లు మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు?
ఇక మూడో విడతగా వచ్చే జనవరిలో రూ.2 వేల చొప్పున విడుదల చేయనుంది. రైతు భరోసా-పీఎం కిసాన్ లో భాగంగా ఏటా రైతుకు రూ.13,500 మేర సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. తొలి విడత సాయాన్ని ఈ ఏడాది మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున అందజేసింది. రెండో విడతగా రూ.4వేలు, సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందిస్తారు. రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 ప్రభుత్వం అందిస్తోంది.
ఆళ్లగడ్డ వేదికగా బటన్ నొక్కిడం ద్వారా అందించిన రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.25,971.33 కోట్ల మేర డబ్బులు జగన్ హయాంలో అందించినట్టు లెక్కిస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద మోడీ సర్కార్ రూ. 2వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ. 6వేలను ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ, రైతు భరోసా కింద జగన్ సర్కార్ జమ చేయాల్సిన రూ. 7500 మాత్రం చాలా మంది రైతులకు అందడంలేదు. ఎండీవో, గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ రైతులు తిరుగుతోన్న సందర్భాలు అనేకం. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. దీంతో జగన్ ఇస్తోన్న రైతు భరోసా బటన్ నొక్కుడు వరకే పరిమితం అవుతోందన్న విమర్శ లేకపోలేదు.
Also Read: YS Jagan : పవన్ విశాఖ టూర్ పై జగన్ `విద్వేష` మాట