Balakrishna Birthday : బాల‌య్య పుట్టిన‌రోజు జ‌గ‌డం

నంద‌మూరి బాల‌క్రిష్ణ అలియాస్ బాల‌య్య టాలీవుడ్ టాప్ హీరో. హిందూపురం ఎమ్మెల్యేగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 10, 2022 / 01:36 PM IST

నంద‌మూరి బాల‌క్రిష్ణ అలియాస్ బాల‌య్య టాలీవుడ్ టాప్ హీరో. హిందూపురం ఎమ్మెల్యేగా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. వ‌రుస‌గా అక్క‌డి నుంచి రెండుసార్లు గెలిచిన ఆయ‌న హాట్రిక్ గెలుపు కోసం పావులు క‌దుపుతున్నారు. అంతేకాదు, అల్లుడు నారా లోకేష్ ఇంచార్జిగా ఉన్న మంగ‌ళ‌గిరిలోనూ సేవ చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ప్ర‌భుత్వానికి పైసా ఖ‌ర్చులేకుండా సొంతంగా అన్న క్యాంటిన్ల‌ను న‌డ‌ప‌డానికి బాల‌య్య ముందుకొచ్చారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం అన్న క్యాంటిన్ల ను ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. ఆయ‌న అభిమానులు మంగ‌ళ‌గిరి బ‌స్టాండ్ వ‌ద్ద క్యాంటీన్ ఏర్పాటు చేశారు. రాత్రికిరాత్రి దాన్ని జగన్ మోహన్ రెడ్డి స‌ర్కార్ కూల్చివేసింది.

రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలోనే మంగ‌ళ‌గిరి ఉంది. అక్క‌డి బాల‌య్య అభిమానులు, అన్న క్యాంటిన్ కూల్చ‌వేత‌దారుల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బాల‌కృష్ణ అభిమానులు, టీడీపీ శ్రేణులు అన్న క్యాంటీన్ ప్రారంభించాల‌ని రంగంలోకి దిగారు. బ‌స్టాండ్ స‌మీపంలోని ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద చాలా రోజులుగా టీడీపీ శ్రేణులు చ‌లివేంద్రాన్ని కొన‌సాగిస్తున్నారు. అక్క‌డే అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

అన్న క్యాంటిన్ ఏర్పాటు స‌మాచారం అందుకున్న న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు క్యాంటీన్ ఏర్పాట్ల‌ను అడ్డుకున్నారు. సేవా కార్యక్ర‌మం మాత్ర‌మే చేస్తున్నామ‌ని టీడీపీ శ్రేణులు చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. టీడీపీ శ్రేణులు న‌గ‌ర‌పాల‌క సంస్థ అధికారుల‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించారు. అన్న క్యాంటీన్ ఏర్పాట్ల‌లో మునిగిన బాల‌య్య అభిమానులు, టీడీపీ శ్రేణుల‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇదంతా చూసిన జ‌నం మాత్రం సేవ చేయ‌డానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను తొల‌గించ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీఎం అయిన త‌రువాత ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటిన్ల‌ను ప్రారంభించారు. అన్నార్తుల‌కు కేవ‌లం రూ. 5ల‌కు అన్నం పెట్టే వాళ్లు. అన్న‌పూర్ణ రాష్ట్రంగా పేరున్న ఏపీలో అన్న క్యాంటిన్లు అభాగ్యుల‌కు ఆక‌లి తీర్చేవి. 2019 ఎన్నిక‌ల్లో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన త‌రువాత వాట‌న్నింటినీ మూసివేశారు. దీంతో అభాగ్యుల‌కు అన్నం లేకుండా పోయింది. ప్ర‌భుత్వం అన్న క్యాంటిన్ల‌ను మూసివేసిన‌ప్ప‌టికీ సొంత ఖ‌ర్చుల‌తో హీరో బాల‌క్రిష్ణ అన్న క్యాంటిన్ల‌ను ప్రారంభించాల‌ని భావించారు. ఆ మేర‌కు తొలి విడ‌త‌గా మంగ‌ళ‌గిరి కేంద్రంగా అన్న క్యాంటిన్ బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కానీ, జ‌గ‌న్ స‌ర్కార్ స‌సేమిరా అంటూ అడ్డుకోవ‌డంపై ఏపీ జ‌నం ముక్కున వేలేసుకుంటున్నారు.