Site icon HashtagU Telugu

AP Employees : టీచ‌ర్లు,ఉద్యోగుల హాజ‌రుకు `ఫోన్ యాప్‌` కొర‌ఢా

Attendance

Attendance

రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుండి ముఖ గుర్తింపు విధానం(ఫేస్ రిగ‌గ్నైజేష‌న్‌) ద్వారా హాజ‌రు ప‌ద్ధ‌తిని జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ హాజరు మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఫోన్ యాప్‌ల ద్వారా మాత్రమే హాజరు నమోదు చేసుకోవాలి. వీరితో పాటు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో తమ హాజరు నమోదు చేసుకోవాల‌ని స‌ర్కుల‌ర్లో క్లియ‌ర్ గా ఉంది.

సెప్టెంబర్ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్ హాజరు నమోదు చేయరాదని ప్ర‌భుత్వం ఆదేశించింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా మాన్యువల్ రిజిస్టర్లలో హాజరు నమోదు చేసుకోవాలని పేర్కొంది. రాబోయే నెల రోజుల్లో అన్ని విభాగాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్ర‌భుత్వం చెబుతోంది.

ఆండ్రాయిడ్ ఫోన్ లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ హాజరును ప్రధానోపాధ్యాయులు లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్ ద్వారా నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగుల నమోదును బుధవారం నాటికి పూర్తి చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, మండల, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో, విద్యాశాఖలోని ఇతర కార్యాలయాలకు కూడా యాప్ ద్వారా హాజరు నమోదు వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, డీఈఓలు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.