Vidyarthi Mitra : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లను పాఠశాలల పునఃప్రారంభ మొదటి రోజే అందించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (SSA) భారీ ఏర్పాట్లు చేస్తోంది. విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారికి నాణ్యమైన విద్యాసామాగ్రిని సమయానికి అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ విద్యార్థి మిత్ర కిట్లో ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్లు, నోట్‌బుక్లు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగ్, రెండు జతల సాక్సులు, బెల్ట్ లాంటి అవసరమైన వస్తువులు ఉంటాయి. మొదటి తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా పిక్టోరియల్ డిక్షనరీను కూడా అందిస్తారు. ఈ కిట్లలో ఎలాంటి రాజకీయ పార్టీల రంగులు, గుర్తులు లేకుండా మౌలిక విద్యాపట్ల నిష్పక్షపాతతను పాటించనున్నారు.
Read Also: Shocking : లైంగిక వేధింపు.. 60 ఏళ్ల వృద్ధుడిని చంపిన మహిళలు..
ఈ నెల 20న నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కమిటీ సమావేశం (PTM) నాటికి అన్ని కిట్లు విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 95% పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వస్తువులు కూడా వేగంగా మండలాలకూ, అక్కడి నుంచీ పాఠశాలలకూ తరలిస్తున్నారు. ఇంత భారీ కార్యకలాపానికి సమర్థవంతమైన నిర్వహణ కోసం రాష్ట్ర, జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో ప్రత్యేక SSA కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి సీనియర్ అధికారి వ్యవహారాల పర్యవేక్షణకు బాధ్యత వహిస్తున్నారు. కిట్ల నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి వస్తువు మూడు దశల తనిఖీకి లోనయ్యే తరువాతే విద్యార్థులకు పంపిణీ చేస్తారు.
ముడి సరుకు కొనుగోలు నుంచి విద్యార్థుల చేతికి కిట్ చేరే వరకూ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాప్ ద్వారా ట్రాకింగ్ జరుగుతుంది. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన లారీ వివరాలు, మండలానికి చేరిన సమాచారం, పంపిణీ వివరాలు ఇలా ప్రతి అంశాన్ని సమగ్రంగా పర్యవేక్షించనున్నారు. చివరగా విద్యార్థుల వద్ద పంపిణీ జరిగిన తరువాత బయోమెట్రిక్ నమోదు ద్వారా నిర్ధారిస్తారు. 2025–26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 35.94 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఒక్కో కిట్‌పై ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది. మొత్తం వ్యయం రూ.953.71 కోట్లు కాగా, ఇందులో కేంద్రం రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.778.68 కోట్లు భరించనుంది. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో కిట్ ఖర్చు రూ.2,462గా ఉండగా, ఇప్పుడు ఖర్చును తగ్గించి రూ.63.80 కోట్ల ఆదా చేయడం గమనార్హం.
ఈ సారి విద్యార్థులకు సరికొత్త రంగులతో ఏకరూప దుస్తులు ఇవ్వనున్నారు. బాలురు, బాలికలకు ఒకే తరహా దుస్తులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఓలివ్ గ్రీన్ ప్యాంట్ లేదా గౌను, లైట్ ఎల్లో మరియు గ్రీన్ చారల చొక్కా ఇవ్వనున్నారు. మైనారిటీ మాధ్యమ పాఠశాలల విద్యార్థులకు వారి భాషకు అనుగుణంగా ఇంగ్లీష్-ఇంగ్లీష్-స్థానిక భాష డిక్షనరీలు కూడా అందిస్తారు. ఇందులో తమిళ్, ఒడియా, కన్నడం, ఉర్దూ భాషల డిక్షనరీలు ఉండడం విశేషం. ఇలాంటి చర్యల ద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే పూర్తిస్థాయి అవసరాల్ని పొందుతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే కాక, సమాన అవకాశాలను కల్పించడంలో ఈ కిట్లు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.