ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి (Sankranti ) పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. పండుగకు ఒక్కరోజు ముందు నుంచే ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కోస్తా జిల్లాల్లో (Krishna Districts) పలు వినోదాత్మక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పల్లెల్లో సంప్రదాయ సంబరాలు కొనసాగుతుండగా, పట్టణాల్లో ఆధునిక ఉత్సవాలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. కోడి పందేలు సంక్రాంతి పండుగలో ప్రధానంగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తాయి. వీటితో పాటు కేరళ తరహాలో నిర్వహించే పడవ పోటీలు ఈ సారి కొత్తగా చోటుచేసుకున్నాయి. కోనసీమలోని ఆత్రేయపురం ప్రధాన పంట కాల్వలో డ్రాగన్, కయాకింగ్, కానోయింగ్ వంటి విభాగాల్లో నిర్వహించిన పడవ పోటీలు చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
Nuclear Engineers Kidnapped : 16 మంది న్యూక్లియర్ ఇంజినీర్లు కిడ్నాప్.. పాక్‌లో కలకలం
పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో నిర్వహించిన పొట్టేళ్ల పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు పోటీలో పాల్గొనడం, ప్రజలు వాటిని ఉత్సాహంగా చూసి ఆనందించడం చూసి పండుగ సంబరాలు మరింత వేడుకలమయంగా మారాయి. ఇలాంటి పందేలు గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించడమే కాకుండా, స్థానిక సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక యువత సాంస్కృతిక ప్రదర్శనలు, రంగవల్లులు, కైట్స్ ఎగరడం వంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పల్లెల్లో గంగిరెద్దులు, హరికథలు, బుర్రకథలు, ఇతర సాంప్రదాయ కళారూపాలు పండుగ వాతావరణాన్ని మరింత రంగులమయంగా మార్చుతున్నాయి.
ఈ సంక్రాంతి వేడుకలు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో హర్షోత్సాహంగా సాగుతున్నాయి. పల్లెల్లో సంప్రదాయాలు, పట్టణాల్లో వినోదం కలగలిపి సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. ప్రజలు కుటుంబాలతో కలిసి పాల్గొంటూ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలు సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకతను తెలియజేస్తూ అందరికి ఆనందాన్ని పంచుతున్నాయి.