Site icon HashtagU Telugu

Sankranthi Politics: సంక్రాంతి ‘పొలిటిక‌ల్’ పందెం

Jagan Rrr

Jagan Rrr

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు(త్రిబుల్ ఆర్‌), ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ క‌థ న‌డుస్తోంది. సంక్రాంతికి సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సాపురంకు త్రిబుల్ ఆర్ వ‌స్తోన్న క్ర‌మంలో్ సీఐడీ పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. హైద‌రాబాద్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు బుధ‌వారం ఉద‌యం వెళ్లారు. నోటీసులు అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయ‌న అక్క‌డ లేడు. త్రిబుల్ ఆర్ కుమారుడు నోటీసుల‌ను అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, సీఐడీ పోలీసులు అత‌నికి ఇవ్వ‌కుండా వెనుతిరిగారు.వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు( త్రిబుల్ ఆర్‌) సంక్రాంతి సంద‌ర్భంగా సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సాపురం షెడ్యూల్ ను రెండు రోజుల క్రితం మీడియాకు వెల్ల‌డించాడు. ఢిల్లీ నుంచి ఈనెల 13వ తేదీన బ‌య‌లుదేరుతున్నాడు. రెండు రోజుల పాటు భీమ‌వరంలోని సొంత ఇంట్లో ఉంటాడు. తిరిగి ఈనెల 16వ తేదీని ఢిల్లీ వెళ్తాడు. ఆ మేర‌కు షెడ్యూల్ ను ఆయ‌న ప్ర‌క‌టించ‌డంతో పాటు రాజీనామా అంశాన్ని కూడా ప్ర‌స్తావించాడు. అన‌ర్హ‌త వేటు వేయించ‌డానికి ట్రై చేసుకోవాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ కు స‌వాల్ విసిరాడు. చేత‌గాలేద‌ని అంగీక‌రిస్తే, స్వ‌యంగా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ‌తాన‌ని వెల్ల‌డించాడు.

మూడు నెల‌ల క్రితం త్రిబుల్ ఆర్ ను హైద‌రాబాద్ లో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ పై సోష‌ల్ మీడియాలో పోస్టులు, అనుచిత‌ వ్యాఖ్యలు చేసిన అంశంపై సీఐడీ కేసు న‌మోదు చేసింది. సొంత రాష్ట్రానికి ఆయ‌న రెండేళ్లుగా దూరంగా ఉండ‌డంతో సీఐడీ పోలీసులు నోటీసులు అందించ‌డానికి కూడా వీలుకాలేదు. హైద‌రాబాద్ లో త్రిబుల్ ఆర్‌ ఉన్నాడ‌ని తెలుసుకుని ఇటీవ‌ల నోటీసులు జారీ చేయ‌డంతో పాటు అదే రోజు అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది. ఏపీకి ఆయ‌న్ను సీఐడీ పోలీసులు త‌ర‌లించారు. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాలన్నీ తెలిసిన‌వే. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని ఏపీ సీఐడీ మీద త్రిబుల్ ఆర్ అభియోగం మోపాడు. ఆ మేర‌కు లోక్ స‌భ‌లోనూ సుప్రీం కోర్టులోనూ పిటిష‌న్ వేశాడు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు ఆ ఇష్యూను తీసుకెళ్లాడు. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని ఆంక్ష‌లను సుప్రీం కోర్టు విధించింది.ఆంక్ష‌ల న‌డుమ వైసీపీ రెబ‌ల్ ఎంపీ త్రిబుల్ ఆర్ న‌డుచుకోవాలి. కానీ..ఇటీవ‌ల ర‌చ్చ‌బండ‌ను మ‌ళ్లీ ప్రారంభించాడు. గ‌తంలో మాదిరిగా ఏపీ ప్ర‌భుత్వంపై దూకుడుగా మాట్లాడుతున్నాడు. ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై జ‌గ‌న్ ను దుయ్య‌బ‌డుతున్నాడు. న‌వ‌ర‌త్నాల నుంచి ఇటీవ‌ల వివాద‌స్ప‌దం అయిన సినిమా టిక్కెట్ల వ‌ర‌కు ర‌చ్చబండ ద్వారా క‌డిగేస్తున్నాడు. ప‌లు ఛాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూల‌ను కూడా ఇటీవ‌ల ఇచ్చాడు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సుప్రీం ఆంక్ష‌ల‌ను ధిక్క‌రించేలా ఉన్నాయ‌ని ఏపీ సీఐడీ భావిస్తుంద‌ని తెలుస్తోంది. అందుకే, మ‌రోసారి త్రిబుల్ ఆర్ కు నోటీసులు జారీ చేసి..సంక్రాంతి సంద‌ర్భంగా వ‌స్తోన్న ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. వ్య‌వ‌స్థ‌ల నిఘా న‌డుమ త్రిబుల్ న‌ర్సాపురం లోక్‌స‌భ ప‌రిధిలోని భీమ‌వ‌రం రావాల‌ని ప‌క్కాగా స్కెచ్ వేసుకున్నాడు. లోక్‌స‌భ నీడ‌, న్యాయ అండ‌, మీడియా నిఘా, బీజేపీ పెద్ద‌ల ఆశీస్సుల‌ను పొందడం ద్వారా టూర్ స‌క్సెస్ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ కు స‌వాల్ చేసి వ‌స్తోన్న త్రిబుల్ ఆర్ ను ఏమీ చేయ‌లేక‌పోతే ప‌రువు పోతుంద‌ని వైసీపీ భావిస్తుందట‌. ఆ క్ర‌మంలో ఏపీ సీఐడీ, త్రిబుల్ ఆర్ న‌డుమ ప్రారంభ‌మైన టామ్ అండ్ జెర్రీ క‌థ క్లైమాక్స్ ఏంటో చూద్దాం!