Chandrababu Naidu: రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు అంటూ ఏపీ పోలింగ్ పై రియాక్ట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనమని, భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఎపి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటరు దేవుళ్లకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.