Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్యే టికెట్ రాకపోతే వెళ్లిపోవడం కరెక్ట్ కాదు.. యార్లగడ్డపై సజ్జల వ్యాఖ్యలు..

యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీ మీద మీడియా ముందు ఆరోపణలు చేయడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి(Sajjala Ramakrishna Reddy) మీడియా ముందుకి వచ్చి యార్లగడ్డపై ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - August 18, 2023 / 06:00 PM IST

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం(Gannavaram) రాజ‌కీయం రసవత్తరంగా మారింది. అమెరికా నుంచి వ‌చ్చిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు(Yarlagadda Venkat Rao) 2018 నుంచి వైసీపీకి(YCP) ప‌నిచేస్తున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ(Vallabhaneni Vamshi) మీద ఓడిపోయారు. ఆ తర్వాత వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని పూర్తిగా తప్పించి అక్క‌డ నుంచి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావును రంగంలోకి దింప‌డానికి ఆలోచిస్తున్నారు చంద్రబాబు(Chandrababu). యార్లగడ్డ వైసీపీని వీడినట్టు ప్రకటించి పార్టీపై నేడు సంచలన ఆరోపణలు చేశారు.

అలాగే మళ్ళీ గన్నవరం నుంచే పోటీ చేస్తాను అని కూడా చెప్పారు కానీ ఏ పార్టీ నుంచి అనేది చెప్పలేదు. దీంతో యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తారని, చంద్రబాబు కూడా యార్లగడ్డపై పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ తన కార్యకర్తలతో, అనుచరులతో మీటింగ్ పెట్టిన యార్లగడ్డ త్వరలోనే ఏ పార్టీలోకి అనేది కూడా ప్రకటిస్తాను అన్నారు. మోజార్టీ అనుచ‌రులు టీడీపీలో చేరాల‌ని సూచించినట్టు సమాచారం.

అయితే యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీ మీద మీడియా ముందు ఆరోపణలు చేయడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి(Sajjala Ramakrishna Reddy) మీడియా ముందుకి వచ్చి యార్లగడ్డపై ఫైర్ అయ్యారు.

సజ్జల మాట్లాడుతూ.. ఏ పార్టీలో అయినా ఎన్నికల సమయంలో పోటీ చెయ్యాలని ఆశావహులు ఉంటారు. యార్లగడ్డ కూడా అలానే అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి అందరికీ అవకాశాలు రావు. వైసీపీ లాంటి బలమైన పార్టీలో పోటీ చెయ్యాలని ఆశగా ఉండటం సహజమే. అవమాన పరచడం, బాధ పెట్టడం అనేవి మా పార్టీలో ఉండవు. యార్లగడ్డకు బాధ ఉంటే వచ్చి మాట్లాడాలి. ఇలాంటివి పార్టీలో ఇంటర్నల్ గా చర్చలు జరగాలి. ఇంతకు ముందు మాతో వచ్చి మాట్లాడారు, ఇప్పుడెందుకు రాలేదు. వరుస మీటింగ్స్ పెట్టి బహిరంగంగా ఉద్దేశ్యాలు చెప్పడం కరెక్టు కాదు. ముందే నిర్ణయం తీసుకుని మీటింగ్స్ పెట్టారు అని ఆరోపించారు.

ఇక యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తారు అనేదానిపై సజ్జల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. పోతే పో అని నేను అనలేదు. మీడియా వక్రీకరించింది. చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారని మేము అనలేదు. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే పార్టీ నుండి వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. 2019లో పోటీ చేసి కష్టపడ్డాడు. మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చాలా సార్లు చెప్పాం కానీ వినలేదు. సీఎం అపాయింట్మెంట్ అడిగారో లేదో నాకైతే తెలీదు అని అన్నారు. మరి వీటికి కౌంటర్ గా యార్లగడ్డ సమాధానం ఇస్తారా చూడాలి.