Site icon HashtagU Telugu

Chitoor Jawan: వీర సైనికుడు సాయితేజ అంత్య‌క్రియ‌లు..భారీ ఏర్పాట్లు చేసిన స్థానికులు

lance naik sai teja

Andhra Pradesh jawan Lance Naik Sai Teja among 13 slain in chopper crash

తమిళనాడులోని నీలగిరిలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు జవాన్ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరులోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయంతో ఉదయం 5 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన ఆర్మీ అధికారులు బెంగళూరు నుంచి నేరుగా మదనపల్లెకు చేరుకుంటారు. మదనపల్లెలో ఎగువ‌రేగ‌డికి 30 కిలోమీట‌ర్ల మేర అంతిమ‌యాత్ర జ‌ర‌గ‌నుంది. ఈ అంతిమ యాత్ర‌కు స్థానికులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అంతిమ‌యాత్ర అనంతరం త‌న తాతయ్య సమాధి పక్కనే సాయితేజ అంత్యక్రియలను కుటుంబ‌స‌భ్యులు నిర్వహించనున్నారు.

నిన్న యలహంక ఎయిర్ బేస్ లో సాయితేజకు ఆర్మీ అధికారులు నివాళులర్పించి అక్కడి నుంచి బెంగళూరు ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సాయితేజ తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీ అధికారులు ఈరోజు మృతదేహాన్ని తీసుకువస్తున్నారు. ఉదయం 9.00 గంటలకు కురబలకోట మండలం ఎగువ‌రేగడపల్లెలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు క‌లెక్ట‌ర్‌ తెలిపారు

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం సానుభూతి తెలిపింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, కృష్ణయ్యలను మంత్రులు ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సాయితేజ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు.