Site icon HashtagU Telugu

SAAP : అవినీతి, అక్ర‌మాల అడ్డాగా శాప్‌.. ఎండీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం

Saap Md Imresizer

Saap Md Imresizer

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్‌) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. త‌దుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో(జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. క్రీడా సామగ్రి కొనుగోలు, క్రీడాకారులకు సర్టిఫికెట్ల జారీ వంటి ఇతర పరిపాలనా కార్యకలాపాల్లో శాప్‌పై ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కె హర్షవర్ధన్‌కు వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాప్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయని శాప్‌కు చెందిన ముగ్గురు పాలకమండలి సభ్యులు కె నరసింహులు, డేనియల్ ప్రదీప్, కె వరలక్ష్మి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం కప్ టోర్నీ కూడా ఆలస్యంగా జరగడంతోపాటు క్రీడాకారులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జారీలోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు ప్రభాకర్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.