Rushikonda Palace: గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండలో రూ.500 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏ కార్యక్రమాలకు కూడా ఉపయోగించడం జరుగడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు సరిపోదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కన్వెన్షన్ సెంటర్‌గా మారే అవకాశాలు కూడా లేవని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఈ భవనాలను ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలనుకుంటే, చాలా తీవ్ర భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద భారంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ భవనాలను ఏమైనా వినియోగిస్తే, కేవలం విద్యుత్ బిల్లులే నెలకు రూ.25 లక్షల వరకు వస్తాయని అంచనా వేశారు. అదనంగా, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగా ఉంటాయని చెప్పారు.
రూ.85 లక్షల పెండింగ్:
గతేడాది నవంబర్ నుంచి రుషికొండలోని భవనాలకు కరెంట్ ఉపయోగిస్తున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున రూ.7 లక్షల కరెంట్ బిల్ వస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ బిల్లులు చెల్లించలేదు, అందువల్ల దాదాపు రూ.85 లక్షల బకాయిలు ఏర్పడ్డాయి. కేవలం రాత్రిపూట విద్యుద్దీపాలు కారణంగా ఈ స్థాయిలో కరెంట్ బిల్ వచ్చింది అని చెబుతున్నారు. పూర్తిగా వినియోగిస్తే, మరింత అధికమైన బిల్ వచ్చిన ఆశ్చర్యం లేదు.
అడుగుకు రూ.30 వేలు:
ఐదు బ్లాకుల భవనాలను మొత్తం 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. చదరపు అడుగుకు సగటున రూ.30 వేలు ఖర్చు అయ్యింది. ఈ భవనాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఫర్నీచర్ అమర్చబడింది. తరువాత ఎన్నికలు రావడంతో, వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో పెండింగ్ పనులు ఆగిపోయాయి. మిగిలిన ఫర్నీచర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది.
భవనాలకు తాళాలు:
ప్రస్తుతం ఈ భవనాలకు తాళాలు వేసి ఉంచారు, కాపలాకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 10 నెలలుగా సరైన నిర్వహణ లేకపోవడంతో, భవనాలు దుమ్ము పట్టాయి. కొన్ని పరికరాలు తుప్పు పట్టి ఉన్నాయి. సముద్రాన్ని ఆనుకొని ఉండటం వల్ల ఉప్పు నీటి గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల, సరైన నిర్వహణ లేకపోతే ఫర్నీచర్ పాడైపోవడం సాధ్యమే అని వారు పేర్కొంటున్నారు.
వేసవిలో అసెంబ్లీ సమావేశాలు?
ఈ భవనాలను ప్రభుత్వం వినియోగించుకోవాలనే డిమాండ్ ఉంది. ఖాళీగా ఉంచేకంటే, ఏదైనా సంస్థకు అప్పగిస్తే ఆదాయం వస్తుందని వాదిస్తున్నారు. లేకపోతే, ఈ భవనాల్లో వేసవి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించవచ్చు అని స్థానికులు సూచిస్తున్నారు. అప్పుడు నిర్వహణ సరిగ్గా ఉండి, ఫర్నీచర్ పాడైపోకుండా ఉంటుందని వారు అంటున్నారు. అలాగే, పర్యాటకుల కోసం ఈ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.”