Rushikonda Beach Parking Fee : రిషికొండ బీచ్‌కు పెరిగిన పార్కింగ్ ఫీజులు.. వైరల్ అవుతున్న పోస్ట్

రిషికొండ బీచ్ కు వాహనాల్లో వచ్చేవారికి ఊహించని షాక్ తగిలింది. వాహనాల పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 08:00 PM IST

రిషికొండ బీచ్(Rushikonda Beach).. ప్రకృతి ప్రేమికులను రా రమ్మని పిలిచే.. అందమైన బీచ్. ఏపీ టూరిజానికే(AP Tourism) వన్నెతెచ్చిన బీచ్ ఇది. ఓ వైపు సముద్ర అలల చప్పుడు, వాటిపైనుంచి వీచే చల్లని గాలి..ఇంకోవైపు ఆకుపచ్చని రంగులో ఆహ్లాదంగా కనిపించే రిషికొండ. ప్రకృతి ప్రేమికులతో పాటు.. సాయంత్రం వేళ అలా సముద్రం ఒడ్డున కూర్చుని సేదతీరాలని ఆరాటపడే విశాఖ(Vizag) నగరవాసులకు ఆహ్వానం పలుకుతుంటుంది రిషికొండ బీచ్. జూన్ వరకూ ఈ బీచ్ కు వెళ్లేవారికి ఎలాంటి ఫీజు, వాహనాలకు పార్కింగ్ ఫీజులు(Parking Fees) లేవు. జులై నెల నుంచి కొత్తగా పార్కింగ్ ఫీజులను అమల్లోకి తెచ్చారు.

రిషికొండ బీచ్ ను బ్లూ ఫాగ్ బీచ్ గా గుర్తించిన ఏపీ టూరిజం శాఖ జులై 11వ తేదీ నుంచి రిషికొండ బీచ్ కు ఎంట్రీఫీజు రూ.20 నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టిక్కెట్ తీసుకున్నవారు మంచినీరు, టాయిలెట్స్, స్విమ్మింగ్ జోన్, ఆట స్థలాలను కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రకృతి ప్రేమికులు భగ్గుమన్నారు. బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజే కాకుండా.. ఎంట్రీ ఫీజులు కూడా పెట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తాజాగా.. రిషికొండ బీచ్ కు వాహనాల్లో వచ్చేవారికి ఊహించని షాక్ తగిలింది. వాహనాల పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఏపీ టూరిజం శాఖ రిషికొండ బీచ్ వద్ద పార్కింగ్ ఫీజులను పెంచిందనేది ఆ పోస్ట్ సారాంశం. బస్సుకు రూ.00, కారుకు రూ.50, బైక్ కు రూ.20 పార్కింగ్ ఫీజులు పెంచారు. గతంలో ఈ ఫీజులు బస్సుకు రూ.50, కారుకు రూ.30, టూ వీలర్ కు రూ.10గా ఉండేవి. ప్రజలను ఇలా దోచుకోవడానికే ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పార్కింగ్ ఫీజులు ఉన్న బోర్డు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Also Read : Yarlagadda Venkatrao : టీడీపీ లో చేరిన యార్లగడ్డ ..