Site icon HashtagU Telugu

Chandrababu : ఏపీలో విధ్వంస పాల‌న‌: టీడీపీ చీఫ్‌ చంద్ర‌బాబు

CBN Trend

CBN

పాలకులకు ద్వేషం కాకుండా ప్రజలను నడిపించే దృక్పథం ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి హిత‌బోధ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసక పాలన కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని దుయ్య‌బట్టారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు, పార్టీలను అణిచివేస్తారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ పని చేస్తుందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, ఐటీ విప్లవం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు గౌరవంగా జీవిస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు.

సమస్యల పరిష్కారానికి సంపద సృష్టించాల‌ని, లేదంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని చంద్ర‌బాబు అన్నారు. సంప‌ద సృష్టించ‌లేని జ‌గ‌న్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసంతో పాల‌న సాగిస్తున్నార‌ని విమర్శించారు. దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నాయని ఆరోపించారు. పన్నులు, ధరల పెంపుదల వల్ల రాష్ట్రంలోని పేదలు బతకలేని పరిస్థితికి వ‌చ్చార‌ని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారని, పేదలకు అన్నం పెట్టే వ్యక్తులు, సంస్థలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు.

Exit mobile version