Jagan Convoy Issue : జ‌గ‌న్ కాన్వాయ్ క‌థ‌లో ఇద్ద‌రు స‌స్పెండ్

నార్త్ కొరియా అధ్య‌క్షుడు కిమ్ మాదిరిగా ప్రైవేటు వ్య‌క్తుల‌పై దౌర్జ‌న్యం చేసి కారును లూటీ చేసిన సంఘ‌ట‌న ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్ కాన్వాయ్ పేరుతో కారును స్వాధీనం చేసుకున్న‌ చోద్యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

  • Written By:
  • Publish Date - April 21, 2022 / 12:25 PM IST

నార్త్ కొరియా అధ్య‌క్షుడు కిమ్ మాదిరిగా ప్రైవేటు వ్య‌క్తుల‌పై దౌర్జ‌న్యం చేసి కారును లూటీ చేసిన సంఘ‌ట‌న ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్ కాన్వాయ్ పేరుతో కారును స్వాధీనం చేసుకున్న‌ చోద్యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి కాన్వాయ్ అయినంత మాత్రాన ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల‌ను లాగేసుకోవ‌చ్చ‌ని అనుకుంటే ప్ర‌జాస్వామ్యం అప‌హాస్య‌మే. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు స‌మీపంలో చోటు చేసుకున్న ఒక పరిణామం జ‌గ‌న్ పరిపాల‌న వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపుతోంది. శుక్రవారం సీఎం జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు. ఆ సంద‌ర్భంగా కాన్వాయ్ కోసం కార్ల‌ను ఆర్టీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్త సంచలనంగా మారింది. దీని పైన ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేయగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యంగ్యాస్త్రాల‌ను విసిరారు.

దీనికి సంబంధించిన పూర్వ‌ప‌రాలివి. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్‌ కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. ఒంగోలు పాత మార్కెట్‌ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్‌ కోసం ఆగారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వచ్చి ఆ వాహనంతో పాటుగా డ్రైవర్ ను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదంటూ శ్రీనివాస్ వాపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అని చెబుతూ ఆ వాహనం తో పాటుగా డ్రైవర్ ను తీసుకొని వెళ్లారనే ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.

ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్
ఆ ఘ‌ట‌న‌పై మీడియాలో కధనాలు రావటంతో సీఎంవో ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. అనంతరం వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందింది. ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చంద్రబాబు సీరియస్ కామెంట్స్
భార్య, పిల్లలతో తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్తారా అని మండిపడ్డారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందటూ నిలదీసారు. అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడితే, ప్రజలు ఎవరితో చెప్పుకోవాలని దుయ్యబట్టారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలను సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇద్ద‌రు ఆర్టీఏ అధికారుల సస్పెన్ష‌న్‌
ప్రైవేటు వ్య‌క్తుల కారును సీఎం కాన్వాయ్ కోసం అంటూ స్వాధీనం చేసుకున్న ఇద్ద‌రు ఆర్టీఏ అధికారుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఆర్టీఏ అధికారితో పాటు హోంగార్డ్ ను స‌స్పెండ్ చేయ‌డంతో సంచ‌ల‌నంగా మారిన జ‌గ‌న్ కాన్వాయ్ క‌థ సుఖాంతం అయింది.