Pawan Kalyan Vs RS Praveen Kumar : ప‌వ‌నిజంపై ప్ర‌వీణిజం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌రికొత్త రాజ‌కీయాల‌కు నాంది పలికాడు. పైసా ఖ‌ర్చు, శ్ర‌మ లేకుండా పార్టీని తేలిగ్గా న‌డ‌ప‌డం ఎలాగో ప్రాక్టిక‌ల్ గా చూపిస్తున్నాడు. కానీ, ఆయ‌న చేస్తోన్న రాజ‌కీయాన్ని అవ‌కాశ‌వాదంగా బీఎస్పీ తెలుగురాష్ట్రాల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అభివ‌ర్ణిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - January 13, 2022 / 03:17 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌రికొత్త రాజ‌కీయాల‌కు నాంది పలికాడు. పైసా ఖ‌ర్చు, శ్ర‌మ లేకుండా పార్టీని తేలిగ్గా న‌డ‌ప‌డం ఎలాగో ప్రాక్టిక‌ల్ గా చూపిస్తున్నాడు. కానీ, ఆయ‌న చేస్తోన్న రాజ‌కీయాన్ని అవ‌కాశ‌వాదంగా బీఎస్పీ తెలుగురాష్ట్రాల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అభివ‌ర్ణిస్తున్నాడు. సిద్ధాంతాలు లేకుండా పార్టీలు పెడితే..స‌మాజానికి ప్ర‌మాద‌క‌రమ‌ని భావిస్తున్నాడు. బీఎస్పీ అధినేత్రి కాళ్లు ప‌ట్టుకున్న ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ పంచ‌న చేరాడు. ఆ విష‌యాన్ని ఆర్ ఎస్పీ గుర్తు చేస్తున్నాడు. జ‌న‌సేన లాంటి పార్టీల కార‌ణంగా సామాన్యులు, పేద‌లు, స‌మాజం నష్ట‌పోతుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న తేల్చేశాడు.కొత్త పార్టీలు రావ‌డం స‌మాజానికి మంచిదే. సిద్ధాంతాల ఆధారంగా వ‌చ్చే పార్టీలు సామాన్యుల‌కు అవ‌స‌రం. అందుకు భిన్నంగా పుట్టుకొచ్చిన పార్టీల్లో ఒక‌టి ప్ర‌జారాజ్యం. ప్రేమే మార్గం-సేవే ల‌క్ష్యం టాగ్ లైన్ తో నేను సైతం ప్ర‌పంచాగ్నికి స‌మిథ‌నంటూ…నిన‌దించింది. ప్ర‌జ‌లు 2009 ఎన్నిక‌ల్లో 18 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించారు. అవ‌కాశం చూసుకుని అదే ఏడాది కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేశాడు. ఆ విలీనం యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ఉన్న ప‌వ‌న్ కు తెలియ‌కుండా జ‌రిగిందా? అని ప్ర‌శ్నిస్తే..స‌మాధానం ఆయ‌నే చెప్పాలి.

అదే మెగా కుంటుంబం నుంచి 2014 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన ఆవిర్భ‌వించింది. దానికి 2009 నాడు యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ఉన్న ప‌వ‌న్ ఫౌండ‌ర్‌. చేగువీర‌ భావ‌జాలం..జ‌న‌సేన సిద్ధాంతం అంటూ వినిపించాడు. ఎలాంటి నిర్మాణం లేకుండా 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన హోల్ అండ్ సోల్ గా క‌నిపించాడు. ఆ ఎన్నిక‌ల్లో మోడీ, చంద్ర‌బాబు వేదిక‌ల‌పై ప‌వ‌న్ హ‌వా క‌నిపించింది. దీంతో జ‌న‌సేన‌కు అవ‌స‌ర‌మైనంత ఫోక‌స్ వ‌చ్చింది. కేంద్రంలో ప్ర‌ధానిగా మోడీ, రాష్ట్రంలో చంద్ర‌బాబు సీఎం కావ‌డానికి జ‌న‌సేన కార‌ణ‌మంటూ అభిమానులు ప్ర‌చారం చేసుకున్నారు. చివ‌ర‌కు ఆ ప్ర‌చారం టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ వ‌చ్చేలా చేసింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప‌ర‌స్ప‌రం ఆ మూడు పార్టీలు విమ‌ర్శించుకునే వ‌ర‌కు ఆ ప్ర‌చారం వెళ్లింది.ఎవ‌రివారే 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దిగే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ టైంలో జ‌న‌సేన పార్టీ త‌న సిద్ధాంతాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. మ‌తాల ప్ర‌స్తావ‌న‌లేని..కులాల‌ను క‌లిపే సిద్ధాంతం అంటూ రెండు మాటల్లో చెప్పేసింది. జేగువీర బొమ్మ పెట్టుకుని బీఎస్పీ, క‌మ్యూనిస్ట్‌ల తో పొత్తు పెట్టుకుంది. ఆ సంద‌ర్భంగా మాయావ‌తి లాంటి లీడ‌ర్ దేశానికి అవ‌స‌ర‌మ‌ని ప‌వ‌న్ ప‌లు వేదిక‌ల‌పై నిన‌దించాడు. సీన్ క‌ట్ చేస్తే..రెండు చోట్ల ఆయ‌న ఓడిపోవ‌డంతో పాటు ప‌లు చోట్ల డిపాజిట్లు గ‌ల్లంతు అయ్యాయి.

మూడు పార్టీల‌కు క‌లుపుకుని సుమారు 6శాతం ఓటు బ్యాంకు వ‌చ్చింది. అంటే, దాన్లో జ‌న‌సేన వాటా రెండు నుంచి మూడు శాతం ఉంటుంద‌ని…క‌మ్యునిస్టులు, బీఎస్పీ నేత‌ల అంచ‌నా. ఆ ఏడాది సాధార‌ణ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే జేగువీరా బొమ్మ‌ను తిప్పేసి మోడీ బొమ్మ వైపు ప‌వ‌న్ మ‌ళ్లాడు. చేగువీర‌, మోడీ భావ‌జాలం ఇంచుమించు ఒక‌టేనంటూ జ‌న‌సేనాని న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. బీఎస్పీ, క‌మ్మూనిస్ట్ ల‌ను ఆక‌స్మాతుగా వ‌దిలేశాడు. స‌రిగ్గా ఆ పాయింట్ వ‌ద్దే `అవ‌కాశ‌వాదం` డాక్ట‌ర్‌ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కు క‌నిపించింది. దాన్నే ఇప్పుడు ఆయ‌న ఫోక‌స్ చేస్తున్నాడు.ఇదిలా ఉండ‌గా, 2024 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన పార్టీ పొత్తు కోసం ప్ర‌ధాన పార్టీలు పోటీప‌డుతున్నాయి. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ప‌వ‌న్ వ‌ర్చువ‌ల్ మీటింగ్ సంద‌ర్భంగా ప్ర‌స్తావించాడు. అంతేకాదు..ఆ పార్టీల మైండ్ గేమ్ కూడా ఉండొచ్చంటూ క్యాడ‌ర్‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. ప్ర‌త్య‌ర్థి పార్టీల మైండ్ గేమ్ లో ప‌డొద్ద‌ని జాగ్ర‌త్త‌లు చెప్పాడు. పొత్తుపై అంద‌రం కలిసి నిర్ణ‌యం తీసుకుందామ‌ని ప‌రోక్షంగా పొత్తు ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. అంటే, బీజేపీతో త్వ‌ర‌లోనే క‌టీఫ్ చెప్పే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న‌మాట‌.

ఏడేళ్ల క్రితం పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ సంస్థాగ‌తంగా ఇప్ప‌టికీ జ‌న‌సేన బ‌లంగా లేదు. ఇంత‌కాలం పాటు కేవ‌లం ప‌వ‌న్ కు ఉన్న క్రేజ్ తోనే పార్టీ న‌డుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో యథాలాపంగా క‌నిపించ‌డం మిన‌హా చొక్కా న‌ల‌గ‌కుండా..ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు నిత్యం వెళ్ల‌కుండా పార్టీ నిల‌బెడుతూ ప‌వ‌న్ స‌త్తా చాడుతున్నాడు. పార్టీ ఆవిర్భావం నుంచి 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు దాదాపుగా ప‌వ‌న్ చురుగ్గా లేడ‌ని చెప్పాలి. ఆ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఏడాది పాటు జ‌గ‌న్ స‌ర్కార్ కు టైం ఇస్తున్నానంటూ మ‌ళ్లీ సినిమాలు తీసుకోవ‌డానికి వెళ్లాడు. అప్పుడ‌ప్పుడు ఒక‌టి రెండు, ర్యాలీలను నిర్వ‌హించ‌డాన్ని వైసీపీ విమ‌ర్శిస్తోంది. ఆయ‌న రాజ‌కీయాన్ని పొలిటిక‌ల్ కామెడీగా జ‌గ‌న్ పార్టీ భావిస్తోంది.
ఏడేళ్ల‌లో క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీ, టీడీపీ,బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీగా జ‌న‌సేన‌కు గుర్తింపు ఉంది. కేవ‌లం పొత్తుల‌తో రాజ్యాధికారం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ను చూడొచ్చు. కానీ, ఆ పార్టీకి ప్ర‌త్యేక‌వాదం సిద్ధాంతంగా ఉంది. దాని కోసం మ‌హోన్న‌త పోరాటాలు చేసిన చ‌రిత్ర ఉంది. జ‌న‌సేన అందుకు భిన్నంగా పొత్తుల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంది. ఏపీ, తెలంగాణాల్లో ఉధృత‌మైన ప్ర‌జా పోరాటాలు చేసిన పార్టీగా జ‌న‌సేన‌కు ప్ర‌త్యేక గుర్తింపు దాదాపు లేదు. ఇదే అంశాన్ని డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫోక‌స్ చేస్తున్నాడు. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు కాకుండా సిద్ధాంత ప‌ర‌మైన పోరాటాలు చేస్తే స‌మాజానికి మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న భావ‌న‌. సో..ప్ర‌వీణ్ కుమార్‌, ప‌వ‌న్ మ‌ధ్య `సిద్ధాంత` పోరు ఎక్క‌డ వ‌ర‌కు వెళుతుందో..చూడాలి.