ఆంధ్రప్రదేశ్ 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)లో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా (Health insurance) పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, ఈ పథకం ద్వారా ప్రజలు కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేందుకు ఎటువంటి ఆర్థిక భారమూ లేకుండా వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవచ్చని వివరించారు.
మధ్య తరగతి, పేదల కోసం పెద్ద ఊరట
ఈ ఆరోగ్య బీమా పథకం రాష్ట్రంలోని మధ్య తరగతి మరియు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడే ప్రజలు, ఇప్పుడు అధునాతన వైద్య సదుపాయాలను ఎటువంటి ఖర్చు లేకుండా పొందగలరు. ముఖ్యంగా తీవ్రమైన వ్యాధులు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యం వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సదుపాయాలు లేని సందర్భాల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ బీమా ద్వారా చికిత్స పొందే అవకాశం కలుగుతుంది.
ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి, ఆరోగ్య శాఖకు భారీగా నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు మొత్తం రూ.19,264 కోట్లు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు, అధునాతన వైద్య పరికరాలు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. ప్రభుత్వ వైద్య సేవలు బలోపేతం కావడంతో, రాష్ట్ర ప్రజలు మరింత నాణ్యమైన వైద్యం పొందే వీలుంటుందని ప్రభుత్వం నమ్మక వ్యక్తం చేసింది.