సంక్రాంతి వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

తూ.గో(D) కొవ్వూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది

Published By: HashtagU Telugu Desk
Kovvur Rrr Bus Fire

Kovvur Rrr Bus Fire

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో సంక్రాంతి వేళ పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ హుటాహుటిన కిందకు దిగిపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి, బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.

Kovvur Rrr Bus Fire Acciden

జాతీయ రహదారిపై బస్సు మంటల్లో చిక్కుకోవడంతో కొవ్వూరు ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, బస్సులోని ప్రయాణికుల లగేజీ మరియు ఇతర సామాగ్రి మంటల్లో కాలిపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగకు ఊరెళ్తున్న తరుణంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.

ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే, మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం రవాణా శాఖ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో ప్రైవేట్ ఆపరేటర్లు అధిక లాభాల కోసం బస్సుల కండిషన్‌ను పట్టించుకోకుండా నడపడం ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతోందని విమర్శలు వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలపై కఠిన తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  Last Updated: 07 Jan 2026, 09:04 AM IST