`ఆ రెండు పత్రికలు` అంటూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో ప్రచారం చేసి రెండోసారి సీఎంగా గెలిచారు. అదే పంథాను ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మరికొంత విస్తరించారు. `వన్స్ మోర్` అంటూ 2024 దిశగా `దుష్టచతుష్టయం` అంటూ ప్రచారాన్ని ఏపీ సీఎం అందుకున్నారు. సాధారణంగా విపక్షాల్ని ఎదుర్కోవడానికి ప్లీనరీ వేదికలపై తీర్మానాలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ, జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు మూడు మీడియా సంస్థల్ని చేర్చారు. వాటిలో రెండు దివంగత వైఎస్ టార్గెట్ చేసినవే. తాజాగా టీవీ5 ను జత చేయడం గమనార్హం.
రాజకీయ పార్టీలను, మీడియా సంస్థలను వేర్వేరుగా ఎవరైనా చూస్తారు. కానీ, ప్రతిపక్ష పార్టీల జాబితాలోకి ఆ నాలుగు మీడియా సంస్థల్ని , వాటి యాజమాన్యాలను చేర్చారు జగన్. అంటే, తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే దుష్టచతుష్టయంను ఛేదించాలని ఆయన భావిస్తున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహం లేకపోలేదు.
వాస్తవంగా 2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి కోలుకోలేనివి. బహుశా టీడీపీ చరిత్రలో ఒక డిజాస్టర్ అనుకోవాలి. అంతేకాదు, ఆనాడు చంద్రబాబు మాట మీద నమ్మకంతో ద్వితీయశ్రేణి భారీగా పెట్టుబడులు పెట్టి అనే కాంట్రాక్టు పనులు చేశారు. వాటి తాలూకూ బిల్లు ఇప్పటి వరకు రాలేదు. అవి వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా. అంతేకాదు, అమరావతి ప్రాజెక్టును నమ్ముకుని టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ఫలితంగా ద్వితీయ, తృతీయ నాయకులతో పాటు అగ్రశ్రేణి లీడర్లు ఆర్థికంగా చితికిపోయారు. అందుకే, జగన్మోహన్ రెడ్డి సీఎ అయిన తొలి రోజుల్లో ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినప్పటికీ ఉత్సాహం క్యాడర్ ముందుకు రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా మంది దూరంగా ఉన్నారు. ఆ అంశాన్ని గ్రహించిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను వ్యూహాత్మకంగా బహిష్కరించారని ఆ పార్టీలోని టాక్.
సంక్షోభంలో కూరుపోయిన పార్టీని కాపాడేందుకు ప్రస్తుతం జగన్ చెబుతోన్న చతుష్టయం చేదోడువాదోడుగా చంద్రబాబుకు నిలిచింది. పది మంది విశ్లేషకులతో మూడేళ్లుగా జగన్ చెబుతోన్న రెండు ఛానళ్లను నడిపిస్తూ బలమైన ప్రతిపక్షంగా వ్వవహరించాయి. చెరుకూరి రామోజీరావు ఆధ్వర్యంలోని పత్రిక, న్యూస్ ఛానల్, వేమూరి రాధాకృష్ణ నడుపుతోన్న పత్రిక, న్యూస్ ఛానల్ టీడీపికి మద్ధతుగా నిలుస్తుందని ఆనాడు వైఎస్ నుంచి ఇప్పటి జగన్ వరకు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా బొల్లినేని రాజగోపాల్ నాయుడుకు చెందిన న్యూస్ ఛానల్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉందని సీఎం అయినప్పటి నుంచి జగన్ పదే పదే ఎత్తిపొడుస్తున్నాడు. ఆ ముగ్గురి ఇంగ్లీషు పేరులోని తొలి అక్షరం ఆర్. అందుకే, ఇప్పుడు త్రిబుల్ ఆర్ భయం జగన్ కు పట్టుకుంది.
రచ్చబండ పేరుతో రెండేళ్లుగా రఘురామకృష్ణం రాజు(త్రిబుల్ ఆర్) వైసీపీ రెబల్ గా మారారు. ఆయన ప్రతిరోజూ జగన్ సర్కార్ మీద విరుచుకుపడుతున్నారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే బలంగా ప్రజల మధ్యకు తీసుకెళుతున్నారు. ఆయనకు తోడుగా మీడియా రూపంలో త్రిబుల్ ఆర్ లు తయారు అయ్యారని జగన్ ఆక్రోశం. ప్రతిపక్ష నేత చంద్రబాబు , టీడీపీ కంటే బలంగా ఆ నలుగురు కనిపిస్తున్నారని వైసీపీ బాహాటంగా చెబుతోంది. అందుకే, ప్లీనరీ వేదికగా దుష్టచతుష్టయం అంటూ ఒక విభాగం మీడియాపై వ్యతిరేక తీర్మానం చేసి రాజకీయాల్లో సరికొత్త చరిత్రను జగన్ సృష్టించారు.
మాయపకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు టీడీపీ బలం త్రిబుల్ ఆర్ వద్ద ఉన్న విషయాన్ని జగన్ గ్రహించారు. తెలుగుదేశం పార్టీ మూలాలను దెబ్బ కొడుతున్నప్పటికీ ఆ పార్టీ ఇప్పటికీ బలంగా ఉండడానికి కారణాన్ని అన్వేషించారు. బలంగా వాయిస్ వినిపించే లీడర్లు టీడీపీ తరపు నుంచి ముందుకు రానప్పటికీ త్రిబుల్ ఆర్ కు చెందిన మీడియా హౌస్ లు ముందుకు రావడంతో ఆ పార్టీ పుంజుకుందని సర్వేల సారాంశమట. అందుకే ఎల్లో మీడియా అంటూ ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగా జగన్ టార్గెట్ చేశారు. ప్రతి వేదికపైన చంద్రబాబుతో పాటు ఆ ముగ్గురు అంటూ వైసీపీ లీడర్లు పదే పదే చెబుతున్నారు. ఆ రెండు పత్రికలు అంటూ ఆనాడు వైఎస్ విజయం సాధించారు. ఇప్పుడు మూడు మీడియా సంస్థలు అంటూ జగన్ చేస్తోన్న స్లోగన్ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.