Raghurama Krishnam Raju : త్రిబుల్ ఆర్ క‌థ ఇక జైలుకే..?

త్రిబుల్ ఆర్ ఢిల్లీ లింకు క‌దిలింది. తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్టు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు ఫామ్ హౌస్ ఫైల్స్ కేసులో ఎంట్రీ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - November 24, 2022 / 03:50 PM IST

త్రిబుల్ ఆర్ ఢిల్లీ లింకు క‌దిలింది. తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్టు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు ఫామ్ హౌస్ ఫైల్స్ కేసులో ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న‌కు సిట్ నోటీసులు ఇవ్వ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎమ్మెల్యేల‌కు ఎర కేసులో త్రిబుల్ ఆర్ పాత్ర ఉత్కంఠ రేపుతోంది.

రెండేళ్లుగా నిరంత‌రం త్రిబుల్ ఆర్ ఏపీ ప్ర‌భుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. ర‌చ్చ‌బండ పేరుతో ప్ర‌తిరోజూ ఏదో ఒక అంశంపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అంతేకాదు, జగన్మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌తాన్ని, ఆయ‌న మైండ్ సెట్ , బాడీ లాగ్వేజి గురించి బుల్లితెర మీద ప‌దేప‌దే వ్యంగ్యంగా అనుక‌రిస్తుంటారు. అందుకే, ఆయ‌న మీద ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసిన ఆయ‌న్ను అరెస్ట్ చేసిన విష‌యం విదిత‌మే. ఆ సంద‌ర్భంగా తెలంగాణ పోలీసులు స‌హ‌కారం అందించార‌ని అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఢిల్లీ వీడ‌కుండా అక్క‌డే ఉంటున్నారు. ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని కూడా ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, అమిత్ షాల‌తో త్రిబుల్ ఆర్ సాన్నిహిత్యంగా మెలుగుతారు. పార్ల‌మెంట్ వేదిక‌గా ప‌లు సంద‌ర్భాల్లో ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ ధైర్యంతోనే ఆయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద నిత్యం ధ్వ‌జ‌మెత్తుతుంటారు. బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో ఆయ‌న క‌లివిడిగా ఉంటారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా విచార‌ణ‌లో ఉన్న‌ రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ల‌తో త్రిబుల్ ఆర్ కు ఉన్న సాన్నిహిత్యాన్ని సిట్ గుర్తించింద‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేకించి రామ‌చంద్ర‌భార‌తి స‌న్నిహితుల జాబితాలో త్రిబుల్ ఉన్నార‌ని అనుమానిస్తోంద‌ని స‌మాచారం. పైగా ఏపీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ఇదే టీమ్ ప‌నిచేసింది. ఆ విష‌యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే.

ఏపీ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని చాలా కాలంగా త్రిబుల్ చెబుతున్నారు. అంతేకాదు, బీజేపీలోకి 60 నంచి 70 మంది ఎమ్మెల్యేలు వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌చారం జ‌రిగింది. ఒకానొక సంద‌ర్భంలో అసెంబ్లీ వేదిక‌గా బీజేపీలోకి వైసీపీ విలీనం కాబోతుంద‌ని గాసిప్స్ కూడా వినిపించాయి. వాటికి బ‌లం చేకూరేలా 70 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌బోయార‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియోల‌ను దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీల చీఫ్ ల‌కు పంపిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా పంపిచార‌ట‌. దీంతో రామ‌చంద్ర‌భార‌తి, త్రిబుల్ ఆర్ కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయ‌నుందని తెలుస్తోంది.

ఎమ్మెల్యేల ఎర కేసు విచారణకు ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని త్రిబుల్ ఆర్ కు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. ఆ క్రమంలోనే 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపింది. బీజేపీ నేత బీఎస్ సంతోష్, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ కుమార్ లకు నోటీసులు ఇచ్చింది. తాజాగా రఘురాజుకు నోటీసులు జారీ చేయ‌డం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.