Site icon HashtagU Telugu

Somu Verraju : క‌డ‌ప‌పై వీర్రాజు విమానం బాంబ్

Somu Veerraju

Somu Veerraju

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వివాద‌స్పద వ్యాఖ్య‌లు మ‌రోసారి దుమారం రేపుతున్నాయి. ప్రాణాలు తీసే వాళ్లున్న క‌డ‌ప లో విమానాశ్ర‌యం ఎందుకంటే ఆయ‌న చేసిన కామెంట్ ఆ జిల్లా వాసుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను క‌డ‌ప నేత‌లు తీవ్రంగా ప‌రిగ‌ణించారు. నాలుక కోసేస్తామ‌ని ఆ జిల్లాకు చెందిన లీడ‌ర్ రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టేలా వీర్రాజు మాట్లాడ‌డం మానుకోవాల‌ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హిత‌వు ప‌లికాడు. సంచ‌ల‌నాల‌కు ఇటీవ‌ల ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కేంద్రంగా మారాడు. విజ‌య‌వాడ‌లో పెట్టిన ప్ర‌జాగ్ర‌హ స‌భ ద్వారా 50 రూపాయ‌ల‌కు చిప్ లిక్క‌ర్ ఇస్తామంటూ ఆనాడు జాతీయ మీడియాకు ఎక్కాడు. ఆ త‌రువాత నిరుద్యోగుల‌కు నాటుకోళ్ల‌ను కొనిస్తామ‌ని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్పుడు తాజాగా హ‌త్యలు చేసే క‌డ‌ప‌లో విమానాశ్ర‌యం ఎందుకంటూ ప్ర‌శ్నించ‌డంతో దుమారం రేగింది.
క‌డ‌ప ప్రాంతంపై సోము చేసిన వ్యాఖ్య‌ల దుమారం రాష్ట్రాన్ని తాకింది. అక్క‌డి ఎమ్మెల్యేలు వీర్రాజు కు వార్నింట్ లు ఇస్తున్నారు. ఇంకోసారి జిల్లాలో క‌నిపిస్తే దాడి చేస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్ర‌హించారు. ప్ర‌జాస్వామ్యంలో లేక‌పోతే సోము వీర్రాజు నాలుక కోసేవాడినంటూ హెచ్చ‌రించాడు. క‌డ‌ప జిల్లా చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌ని ఆయ‌న‌కు హిత‌వు ప‌లికాడు. చ‌రిత్ర గురించి చ‌ర్చించ‌డానికి సిద్ధ‌మా అంటూ స‌వాల్ విసిరాడు. మ‌రోసారి క‌డ‌ప గురించి ఇలా మాట్లాడితే..మీ ఇంటికి రావాల్సి ఉంటుంద‌ని సీరియ‌స్ వార్నింగ్ రాచ‌మ‌ల్లు ఇచ్చాడు. మొత్తం మీద వీర్రాజు మ‌రోసారి ప్రాంతీయ బాంబ్ పేల్చాడు. అయితే, క‌డ‌ప జిల్లా నుంచి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పిన‌ప్ప‌టికీ వివాదం ఆగ‌లేదు. మొన్న‌టి వ‌ర‌కు టిప్పు సుల్తాన్ విగ్ర‌హం తొల‌గించాల‌ని హ‌ల్ చ‌ల్ చేశాడు. కార్య‌క‌ర్త‌ల‌తో కొన్ని రోజులు ఆ ఎపిసోడ్ న‌డిపాడు. అప్పుడు మ‌తాన్ని, ఇప్పుడు ప్రాంతాన్ని అంశంగా తీసుకుని ర‌చ్చ ర‌చ్చ చేస్తోన్న సోముకు ఢిల్లీ బీజేపీ ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో..చూడాలి.అయితే, ఈ వివాదంపై సోము వీర్రాజు స్పందించారు. ఆయ‌న విడుద‌ల చేసిన ప్రెస్‌నోట్ ఇదీ..

 

Somu Veerraju PressNote :

ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకొక ఎయిర్ పోర్ట్ అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల నిన్న విశాఖపట్టణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, కనీసం రోడ్డు మీద ఉన్న గుంతను కూడా పూడ్చలేని వాళ్లకు ఎయిర్ పోర్టుల సంగతి ఎందుకు, బస్సు వెళ్లలేని చోట కర్నూలులో ఎయిర్ పోర్టు నిర్మించాం, కడపలో ఎయిర్ పోర్టును నిర్మించాం, ప్రాణాలు తీసేసే వాళ్ళ జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు, వాళ్లకు ప్రాణాలు తీసేయడమే వచ్చు, మేము ఎయిర్ పోర్టు వేస్తాం, వీళ్ళేస్తారంట ఎయిర్ పోర్టు (ప్రియతమ నాయకులు వివేకానందరెడ్డి గారిని అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గురించి, అధికారంలో ఉండి కూడా సొంత బాబాయిని హత్య చేసిన వారిని గుర్తించి వారికి శిక్ష వేయించకుండా, ఇంత కాలంగా హత్యకు పాల్పడిన వారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రక్షిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా మాట్లాడిన మాటలు) ముందు మీరు సరైన రోడ్లేయండి, ఎయిర్ పోర్టుల సంగతి మేము చూసుకుంటాం అని మాట్లాడాను.అంతేకానీ, నేను ఎక్కడా కడప జిల్లా ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదు, కేవలం ఆ కొంతమంది వ్యక్తుల మీద వస్తున్న వార్తల ఆధారంగా, కేవలం వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించి, వారిని గురించి మాట్లాడిన కారణంగా, ఇలా మొత్తం కడప జిల్లా ప్రజలను హత్యలకు ఆపాదించినట్లు వైసీపీ నాయకులు కావాలని చిత్రీకరిస్తున్న తప్పుడు వార్తలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. కడప జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయత, సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మితే ప్రాణమిచ్చే వారి తెగింపు ఇవన్నీ బాగా తెలిసినవాడిని, ఇందులో కడప జిల్లా ప్రజలకు మరెవరూ సాటిరారు. అది జగమెరిగిన సత్యం. అలాంటి ఉన్నతమైన ప్రజల గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను,ఆలోచించను. కడప జిల్లా ప్రజలకు మోసపోవటమే తెలుసు కానీ, మోసం చేయడం తెలియని వారు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదరిస్తూ పదే పదే మోసపోతున్నారు. ఇకనైనా వారి మాయనుండి జిల్లా ప్రజలు బయటపడి అభివృద్ధి వైపు పయనించాలని ఆకాంక్షిస్తున్నాను. కడప జిల్లాకు ఎయిర్ పోర్టుతో పాటు అనేక జాతీయ రహదారులను నిర్మించి, వెనుక బడిన జిల్లా క్రింద వందల కోట్ల నిధులను ఇచ్చి, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నది ఒక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్రమోదీ గారి ప్రభుత్వం మాత్రమే. రాబోయే రోజుల్లో బిజెపి అధికారంలోకి వస్తూనే జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను.
వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కడప జిల్లా ప్రజలు నమ్మవద్దని జిల్లా ప్రజలను అభ్యర్థిస్తున్నాను.