Site icon HashtagU Telugu

Sand Scam : ఇక రోజా వంతు వచ్చేసింది..ఆమె అనుచరులు అరెస్ట్

Roja Nagari

Roja Nagari

కూటమి సర్కార్ (Kutami Govt) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై వరుసపెట్టి కేసులు నమోదు చేసి జైలుపాలుచేస్తుంది. ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలను అరెస్ట్ చేయగా..ఇప్పుడు రోజా వంతు వచ్చినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా రోజా అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసారు.

చిత్తూరు జిల్లా నగరిలో ఇసుక అక్రమ రవాణా (Sand Scam ) కేసు పెద్ద దుమారాన్ని రేపుతోంది. వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కె. రోజా అనుచరులైన 11వ వార్డు కౌన్సిలర్ బిలాల్, 14వ వార్డు కౌన్సిలర్ బీడి భాస్కర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను, ఏడు టిప్పర్‌లను మూడు రోజుల క్రితం పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన భరత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ ఇద్దరు కౌన్సిలర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు ఐదేళ్లుగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Nimisha Priya: నిమిషా ప్రియా కేసు.. భార‌త ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

కౌన్సిలర్ల అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి రోజా, వీరిపై పెట్టిన కేసులు తప్పుడు కేసులేనని తీవ్రంగా మండిపడ్డారు. నగరిలో రాజకీయ ప్రత్యర్థులు డ్రామాలు ఆడుతూ వైసీపీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌పై విమర్శలు గుప్పించిన రోజా, ఆయన గెలవడం గాలిలో గెలిచినట్లేనని ఎద్దేవా చేశారు. నగరిలో జరిగే ఇసుక రవాణాకు సంబంధించి మైనింగ్ అధికారులు, పోలీసులు ఏడాదిగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రోజా ఆరోపణలపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ (Bhanu Prakash) కౌంటర్ ఇచ్చారు. నిజంగా రోజా తప్పు చేయకపోతే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆమె తన సోదరుడు, అనుచరులు ఐదేళ్లుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో పాల్గొనలేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. అడ్డంగా పట్టుబడిన తర్వాత రాజకీయ డ్రామాలు ఆడడం సరైంది కాదని అన్నారు. అంతేకాదు రోజా ఉన్న స్థాయి నుంచి ఎంత సంపాదించి మూడు నగరాల్లో ఇళ్ళు కట్టగలిగారు? అని కూడా గాలి భానుప్రకాష్ ఆరోపించారు.

నగరిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వందలాది కొత్త రోడ్లు, కాలువలు, బోర్లు వేశానని గాలి భానుప్రకాష్ తెలిపారు. రోజా ఒక్కసారి నగరిలో ఊర్లు తిరిగితే అభివృద్ధి కనిపిస్తుందన్నారు. సోషల్ మీడియాలో అబద్ధాలు చెబితే అవి నిజం కావని పేర్కొన్నారు. ప్రజలకు నిజం తెలుసని, రోజా వ్యక్తిత్వమే ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. తప్పు చేసినవారు జైలుకే వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలతో నగరిలో రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.

Exit mobile version