Balineni Srinivas Reddy : మాజీ మంత్రి ‘బాలినేని’ కోట‌కు బీట‌లు

క‌రెంట్ కొన్నా డ‌బ్బులే, అమ్మినా డ‌బ్బులే..అంత‌టి ప్రాధాన్యం ఉన్న విద్యుత్ శాఖ నుంచి దూర‌పు బంధువైన బాలినేని.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 04:00 PM IST

క‌రెంట్ కొన్నా డ‌బ్బులే, అమ్మినా డ‌బ్బులే..అంత‌టి ప్రాధాన్యం ఉన్న విద్యుత్ శాఖ నుంచి దూర‌పు బంధువైన బాలినేని. శ్రీనివాస‌రెడ్డిని ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. ఎక్క‌డ తేడా వ‌చ్చిందోగానీ సీఎం జ‌గ‌న్‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి మ‌ధ్య‌ బెడిసింది. ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మ‌యంలో హ‌వాలా బిజినెస్ చేస్తూ దొరికిపోయాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న స్టిక్క‌ర్ తో ఉన్న వాహ‌నం నుంచి కోట్లాది రూపాయాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు నుంచి చెన్నైకి వెళుతోన్న ఆ వాహ‌నం ప‌ట్టుబ‌డ‌డంతో తొలిసారిగా ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా మీడియాకు ఎక్కింది.

స్వ‌త‌హాగా బాలినేని సౌమ్యుడు, విదాదాల‌కు దూరంగా ఉంటారని చెబుతుంటారు. అంతేకాదు, ప్ర‌త్య‌ర్థుల‌పై శ‌త్రుత్వాన్ని కూడా పెంచుకోర‌నే సానుభూతి వ్య‌తిరేక పార్టీలోనూ ఉండేద‌ట‌. ఇటీవ‌ల ఆయ‌న తీరు పూర్తిగా మారింద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని టాక్‌. ఆయ‌న మ‌న‌స్త‌త్వానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న అవినీతి మీద టీడీపీ చార్జిషీట్ ప‌త్రాన్ని విడుద‌ల చేసింది. గ్రానైట్ కంపెనీల నుంచి దోచుకున్నాడ‌ని లెక్క‌క‌డుతూ కోట్లాది రూపాయాల వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెట్టింది. అంతేకాదు, విద్యుత్ , బొగ్గు కొనుగోళ్లు, అమ్మ‌కాల్లో జ‌రిగిన భారీ కుంభ‌కోణాల‌కు సంబంధించిన అంశాల‌ను కూడా టీడీపీ వెలుగెత్తి చాటింది. ఇటీవ‌ల కూడా చెన్నైకి భారీగా హ‌వాల సొమ్ము త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డార‌ని ప్ర‌చారం జోరందుకుంది.

రెండోసారి క్యాబినెట్లో ఆయ‌న‌కు చోటు ల‌భించ‌క‌పోవ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. పైగా ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు గ‌తంలో. ఎప్పుడూ లేనివిధంగా తిర‌గ‌బ‌డుతున్నారు. సామాన్యులు నిల‌దీస్తున్న వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఫ‌లితంగా ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం మీద రోజురోజుకు మ‌చ్చ పెరుగుతోంది. ఒంగోలుకు చెందిన వైశ్యుడు సుబ్బారావు మీద ఆయ‌న అనుచ‌రుడు దాడి చేయ‌డం బాలినేనికి పెద్ద మైన‌స్. ఆ త‌రువాత జ‌గ‌న్ స‌భ‌కు వ‌స్తున్నాడ‌ని ప్రొటోకాల్ వాహ‌నాల కోసం తిరుమ‌ల వెళ్లే ప్ర‌యాణీకుల వాహ‌నాన్ని ఆర్డీవో అధికారులు లాక్కోవ‌డం ఆయ‌న‌కు మ‌రో పెద్ద డ్రా బాక్‌.

ఇటీవ‌ల గ‌డ‌గ‌డ‌ప‌కు వైసీపీ ప్రోగ్రామ్ లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన సంద‌ర్భంగా నిల‌దీశారు. దీంతో ఆయ‌న సంయ‌మ‌నం కోల్పోయి బూతులు అందుకున్నారు. స్థానికంగా ఆయ‌న‌కు ఇదో పెద్ద న‌ష్టంగా చెప్పుకుంటున్నారు. తాజాగా జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి రాయ‌పాటి అరుణ‌కు ఆయ‌న అనుచ‌రుడు అర్థ‌రాత్రి ఫోన్లు చేయ‌డం మ‌రో మైన‌స్ పాయింట్‌. దాన్ని స‌రిచేసుకునే లోపుగానే తాళం వేసి ఇంటిలో బంధించిన మ‌హిళ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న వెనుక బాలినేని ఉన్నాడ‌ని ఆమె చెబుతోంది. ఇలా..ప‌లు సంఘ‌ట‌న‌లు బాలినేనికి ఇబ్బంది క‌లిగించేవిగా ఉన్నాయి. దీంతో ఏదో కుట్ర జ‌రుగుతుంద‌ని ఆయ‌న గ్ర‌హించాడు. దాన్ని చేధించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

సొంత పార్టీ నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఆయ‌న అనుమానం. వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, కుట్ర‌లోని భాగ‌స్వాముల పేర్ల‌ను నేరుగా జ‌గ‌న్ కు తెలియ‌చేస్తాన‌ని వెల్ల‌డించారు. వాళ్ల సంగ‌తి చూస్తానంటూ హెచ్చరిస్తున్నారు. కుట్ర‌లు చేస్తోన్న సొంత పార్టీ లీడ‌ర్లు టీడీపీ వాళ్ల‌తో ట‌చ్ లో ఉన్నార‌ని ఆరోపిస్తున్నారు. తాను త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సవాల్ విసిరారు. రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని కూడా బాలినేని ప్ర‌క‌టించారు. మొత్తం మీద నాలుగు ద‌శాబ్దాల పాటు ఒంగోలును ఏలిన బాలినేనికి ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితి నెల‌కొంది. ఇదంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలియ‌కుండా జ‌రుగుతుంద‌ని బాలినేని భావిస్తున్నారు. కానీ, ఆయ‌న్ను మంత్రిగా తొల‌గించిన‌ప్ప‌టి నుంచే తాడేప‌ల్లి ప్యాలెస్ బాలినేని పై ప్ర‌త్యేక నిఘా పెట్టింది. బ‌హుశా రాబోవు రోజుల్లో టిక్కెట్ కూడా ఇవ్వ‌కుండా త‌ప్పించ‌డానికి పార్టీ అధిష్టానం పెద్ద వ్యూహాన్ని ర‌చించింద‌ని బాలినేని వ్య‌తిరేకులు విశ్వ‌సిస్తున్నారు. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.