Ram Gopal Varma : ఎట్టకేలకు వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీఎస్ కు శుక్రవారం ఆర్జీవీ హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు ఆయన్ను విచారిస్తున్నారు. వర్మను విచారించేందుకు పోలీసులు దాదాపు 50 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక, ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
Read Also: Arrest warrant : అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫ్ చేసిన వీడియోను ట్వీట్ చేశారని రాంగోపాల్ వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్ లో 2024లో ఆర్జీవీపై కేసు నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆయన హాజరు కాలేదు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా రాలేక పోతున్నానని, వీలైనపుడు వస్తానని వర్మ విచారణకు దూరంగా ఉన్నారు. పోలీసులు అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చిన క్రమంలో కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే తను అజ్ఞాతంలో లేనని, విచారణకు హాజరవుతానని ఇటీవలే రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అయితే ప్రస్తుతం విచారణకు ఆర్జీవీ హాజరు కాని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉండటంతో.. శుక్రవారం విచారణకు హాజరయ్యారు.
కాగా, రామ్ గోపాల్ వర్మ ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా గతంలో ముందస్తు బెయిల్ తెచుకున్నాడు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేడు పోలీసుల ముంగిట హాజరయ్యాడు. రామ్ గోపాల్ వర్మ విచారణకు వస్తున్న నేపథ్యంలో మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద వైసీపీ మర్యాద పూర్వకంగా కలిసారు. రామ్ గోపాల్ వర్మను కలిసిన వారిలో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. అలాగే ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకొని రామ్ గోపాల్ వర్మను కలిసారు. రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టడంపై ఎవరి ప్రాయమేమైనా ఉందా అని పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం.
Read Also: Arvind Kejriwal : అభ్యర్థులతో అరవింద్ కేజ్రీవాల్ కీలక సమావేశం