Site icon HashtagU Telugu

YS Jagan : జగన్‌కు ఊరట.. అక్రమాస్తుల కేసుల బదిలీకి ‘సుప్రీం’ నో.. రఘురామ పిటిషన్‌ వెనక్కి

Ys Jaganmohan Reddy Supreme Court Illegal Assets Cases Ysrcp Chief

YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసులను బదిలీ చేయాలని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ నేత రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులను ట్రయల్ కోర్టు రోజు వారీ విచారణకు తీసుకోవాలని,  తెలంగాణ హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం  లేదని,  వాటి విచారణను వేగవంతం చేస్తే సరిపోతుందని ధర్మాసనం(YS Jagan)స్పష్టం చేసింది.

Also Read :Railway Jobs 2025 : రైల్వేలో 32438 జాబ్స్.. టెన్త్‌తోనూ ఛాన్స్.. తెలుగులోనూ పరీక్ష

రఘురామ వెనకడుగు

జగన్ అక్రమాస్తుల కేసులో గత 12 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని రఘురామ తరఫు లాయర్ తెలిపారు. ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌‌ను కూడా డిస్పోజ్‌ చేయలేదన్నారు.  ఇతర కోర్టులకు ఈ కేసుల బదిలీ సాధ్యం కాదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని.. కాబట్టి సుప్రీంకోర్టే ఈ కేసుల్ని పర్యవేక్షించాలని రఘురామ తరఫు లాయర్ వాదన వినిపించారు. ఈ కేసుల్ని హైకోర్టు మానిటర్‌ చేస్తోందని, ఇంకా కేసులు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

Also Read :Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా అన్నారేంటి..?

మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు బెంచ్ 

ఇక సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ.. ‘‘వైఎస్ జగన్ బెయిల్ రద్దుకు కారణాలు ఏమీ లేవు. ఆ కేసుల్ని పర్యవేక్షించమని మాకే చెబుతారా ?’’ అంటూ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈక్రమంలో రఘురామ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘‘మేం హైకోర్టును ఆశ్రయించేందుకుగానూ, సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటాం’’ అని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. దీంతో వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను రఘురామ ఉపసంహరించుకున్నారు.