ముంబై నటి జత్వాని ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు ఏపీ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు చివరకు బెయిల్ లభించింది.
ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కుక్కల విద్యాసాగర్ తన పిటిషన్ దాఖలు చేశాడు. జత్వాని తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. వారు బెయిల్ మంజూరు చేస్తే, నిందితుడు కేసును ప్రభావితం చేయవచ్చని హెచ్చరించారు.
ఇదే సమయంలో, విద్యాసాగర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన, నిందితుడు 76 రోజులుగా జైలులో ఉన్నందున, బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ముందు వాదించారు. ఇరువురి వాదనలు పూర్తయ్యాయి, మరియు కోర్టు ఈ కేసులో తన తీర్పును సోమవారం వాయిదా వేసింది. తర్వాత న్యాయస్థానం, విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వానిని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి జత్నాని కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, విద్యాసాగర్ పరారయ్యాడు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కొన్నిరోజులు తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు. చివరికి డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత, అతన్ని ట్రాన్సిట్ వారెంట్ ఆధారంగా విజయవాడకు తీసుకువచ్చి, అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.
ఈ కేసులో, కాదంబరి జత్నాని తనపై తప్పుడు కేసు నమోదు చేసి మానసికంగా వేధించారని ఆరోపిస్తూ, కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, క్రాంతిరానా, విశాల్‌గున్నీ తదితర పోలీసు అధికారులపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 13న కేసు నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద కేసు దాఖలైంది.
జత్వాని విజయవాడలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, విద్యాసాగర్ పరారీలో ఉన్నాడు. ఈ కేసు సంబంధిత సమాచారం మీడియాకు లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని, కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాదంబరి కేసును సీరియస్‌గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విచారణకై ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరి, తండ్రి నరేంద్రకుమార్ జత్నాని, తల్లి ఆశా జత్నాని నుంచి వాంగ్మూలాలు సేకరించి 100 పేజీల విచారణ నివేదికను రూపొందించారు.
ఈ విచారణలో, కాదంబరి నాలుగు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెలుగు చూసింది. మూడు సార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విద్యాసాగర్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించగా, చివరికి అతన్ని డెహ్రాడూన్ లో పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా, విశాల్ గున్నిలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసారు. అధికార దుర్వినియోగం ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడినట్లు వెల్లడైంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591, 1592 విడుదల చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను “కాన్ఫిడెన్షియల్” గా వెబ్‌సైట్‌లో పేర్కొంది.