Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు.. భారీ ఆస్తి నష్టం.. క్షుద్రపూజలని అనుమానం..

ఈ అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటో తెలియక గ్రామంపై క్షుద్రపూజలు జరిగాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో ఇటీవల కొంతమంది మంత్రగాళ్లను తీసుకువచ్చి ఆ ఊరి గంగమ్మకు పూజలు నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Regular Fire Accidents happening in Chandragiri near Tirupati

Regular Fire Accidents happening in Chandragiri near Tirupati

తిరుపతి(Tirupati) జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్ల గ్రామంలో గత 20 రోజులుగా వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాలు(Fire Accidents) ఎలా జరుగుతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగకపోయినా గ్రామంలోని పలు ఇళ్లల్లో వస్తువులు, బట్టలు, కూలర్లు, వాషింగ్ మిషన్లలో మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాక ఇంటి బయట ఉన్న గడ్డి వాములు కూడా దగ్ధం అవుతున్నాయి.

ఈ అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటో తెలియక గ్రామంపై క్షుద్రపూజలు జరిగాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో ఇటీవల కొంతమంది మంత్రగాళ్లను తీసుకువచ్చి ఆ ఊరి గంగమ్మకు పూజలు నిర్వహించారు. పూజలు చేస్తుండగానే మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్థులు మరింత భయపడుతున్నారు. పలువురు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు గ్రామంలో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. బయటి నుంచి మరింతమంది పోలీసులను రప్పించి 70 మంది పోలీసులతో ఇంటింటి సర్వే చేస్తున్నారు. మంటలకు కారణాలపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారు, కొత్తగా ఎవరు వచ్చారు, ఎవరి ఇంటిలో మంటలు చెలరేగాయి, ఏ సమయంలో చెలరేగాయి. ఇలాంటి అనేక విషయాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి సాంపుల్స్ కూడా సేకరించారు. దర్యాప్తు చేస్తున్నామని, ఎవరూ భయపడవద్దని గ్రామస్థులకు పోలీసులు భరోసా ఇచ్చారు.

 

 

Also Read :  Leopard Jeedimetla : అది చిరుతపులా ? అడవి కుక్కా ? తేలిపోయింది

  Last Updated: 16 May 2023, 04:05 PM IST