ఏపీ రాజ‌కీయాల్లో `సంప్ర‌దాయ` వేడి..బ‌ద్వేల్, నంద్యాల‌, తిరుప‌తి ఉప చ‌ర్చ

సిట్టింగ్ ఎమ్మెల్మే మ‌ర‌ణిస్తే..అదే కుటుంబానికి చెందిన స‌భ్యులు మ‌ళ్లీ పోటీ చేస్తే ఏక‌గ్రీవంగా గెలిపించ‌డం రాజ‌కీయ సంప‌ద్రాయం. దాన్ని ఉమ్మ‌డి ఏపీలో అనుస‌రించిన తొలి పార్టీ తెలుగుదేశం.

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 05:00 PM IST

సిట్టింగ్ ఎమ్మెల్మే మ‌ర‌ణిస్తే..అదే కుటుంబానికి చెందిన స‌భ్యులు మ‌ళ్లీ పోటీ చేస్తే ఏక‌గ్రీవంగా గెలిపించ‌డం రాజ‌కీయ సంప‌ద్రాయం. దాన్ని ఉమ్మ‌డి ఏపీలో అనుస‌రించిన తొలి పార్టీ తెలుగుదేశం. ఆ నాటి నుంచి ఆ సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తోంది. కానీ, దాని వెనుక ఉన్న రాజ‌కీయ కోణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బ‌ద్వేల్ ఉప ఎన్నిక నుంచి టీడీపీ దూరం ఉండ‌డం వ్యూహంలో భాగ‌మ‌ని వైసీపీ వ‌ర్గాల భావిస్తున్నాయి. సంప్ర‌దాయాన్ని అనుకూల రాజ‌కీయ అడుగుల దిశ‌గా తీసుకెళుతున్నార‌ని బీజేపీ కూడా ఆక్షేపిస్తోంది.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో జ‌రిగిన ఎన్నిక‌లు ప్ర‌ధానంగా మూడు. నంద్యాల ఎమ్మెల్యేగా కొన‌సాగుతూ భూమా నాగిరెడ్డి 2017లో చ‌నిపోయాడు. అసెంబ్లీ రికార్డుల ప్ర‌కారం వైసీపీ ఎమ్మెల్యే..కానీ, చ‌నిపోయేనాటికి ఆయ‌న టీడీపీలో ఉన్నాడు. ఆ స‌మ‌యంలో సంప్ర‌దాయాన్ని వైసీపీకి గుర్తు చేసింది టీడీపీ. పార్టీ ఫిరాయింపు కింద భావించిన వైసీపీ బ్ర‌హ్మానంద‌రెడ్డిని రంగంలోకి దింపింది. భూమా అఖిల‌ప్రియ‌ను టీడీపీ అభ్య‌ర్థిగా నిలిపారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌లో అఖిల‌ప్రియ గెలిచింది. ఈ ఎన్నిక సంప్ర‌దాయ విరుద్ధంగా జ‌ర‌గ‌డానికి కార‌ణం వైసీపీ అంటున్నారు టీడీపీ శ్రేణులు.

తిరుప‌తి లోక్ స‌భ ఎంపీ బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ హ‌ఠాత్మ‌ర‌ణం చెంద‌డంతో అక్కడ ఇటీవ‌ల ఉప ఎన్నిక జ‌రిగింది. దుర్గా ప్ర‌సాద్ కుటుంబానికి వైసీపీ తిరిగి టిక్కెట్ ఇవ్వ‌లేదు. దుర్గా ప్ర‌సాద్ కుమారుడు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి ఎమ్మెల్సీ ప‌ద‌విని వైసీపీ ఇచ్చింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి డాక్ట‌ర్ గురుమూర్తిని దింపింది. ఈ ఎన్నిక‌లో సీనియ‌ర్ లీడ‌ర్ ప‌న‌బాక లక్ష్మిని అభ్య‌ర్థిగా టీడీపీ నిలిపింది. ఇక్క‌డ సంప్ర‌దాయానికి టీడీపీ భిన్నంగా వ్య‌వ‌హ‌రించింద‌ని వైసీపీ, బీజేపీ అంటున్నాయి.

దుర్గా ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు కాకుండా డాక్ట‌ర్ గురుమూర్తికి టిక్కెట్ ఇచ్చారు క‌నుక పోటీకి దిగామ‌ని టీడీపీ లాజిక్ చెబుతోంది. ఆ ఉప ఎన్నిక‌లో బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ‌, టీడీపీ అభ్య‌ర్థిగా ప‌న‌బాక తీవ్రంగా ప్ర‌చారం చేశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో పాటు బీజేపీ అతిర‌థులు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. ఇదే త‌ర‌హాలో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ లోకేశ్ తో పాటు సీనియ‌ర్లు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను చూపారు. తీరా, ఫ‌లితాలను చూస్తే వైసీపీ అభ్య‌ర్థి గురు మూర్తి 2.40లక్ష‌ల మోజార్టీ పైగా సాధించాడు. విచిత్రంగా బీజేపీ, టీడీపీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు గ‌ల్లంతు అయ్యాయి.


ప్ర‌స్తుతం బ‌ద్వేల్ ఉప ఎన్నిక వ‌చ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బ‌య్య మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న స‌తీమ‌ణి సుధ‌కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. సంప్ర‌దాయం ప్ర‌కారం పోటీ నుంచి వైదొలుగుతున్నామ‌ని టీడీపీ, జ‌న‌సేన ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎందుకంటే, ఏక‌గ్రీవం కోసం వైసీపీ అభ్య‌ర్థ‌న చేయ‌లేదు. పైగా ప్ర‌త్య‌ర్థుల ఇష్ట‌మ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల ప‌రోక్షంగా పోటీకి స‌వాల్ చేశాడు. కానీ, వ్యూహాత్మ‌కంగా టీడీపీ, జ‌న‌సేన సంప్ర‌దాయం కార్డును ఉప‌యోగించి బ‌రిలోకి దిగ‌కుండా ప‌క్క‌కు త‌ప్పుకున్నాయి. బీజేపీ మాత్రం వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేక‌మ‌ని చెబుతూ బ‌ద్వేల్ లో పోటీ చేస్తోంది.

ఏపీ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన మూడు ఉప ఎన్నిక‌ల్లో మూడు ర‌కాలు టీడీపీ వ్య‌వ‌హ‌రించింది. నంద్యాల, తిరుప‌తి, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో సంప్ర‌దాయాన్ని అనుకూల రాజ‌కీయాల‌కు మ‌లుచుకుందని ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ బాట‌న జ‌న‌సేన కూడా న‌డుస్తోంది. వాస్త‌వంగా బ‌ద్వేల్ లో పోటీ చేసిన‌ప్ప‌టికీ తిరుప‌తి ఫ‌లితాలు రిపీట్ అవుతాయ‌ని ప్ర‌త్య‌ర్థుల‌కు తెలియ‌ని విషయం కాదు. అందుకే, సంప్ర‌దాయం పేరుతో సేఫ్ సైడ్ ను టీడీపీ, జ‌న‌సేన ఎంచుకున్నాయి. ఇదే ఏపీలో పెద్ద హాట్ టాపిక్ కావ‌డం స‌హ‌జమే.