Red Sandalwood : తిరుప‌తిలో 10 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పరిధిలో 10మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Red Sandalwood

Red Sandalwood

తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పరిధిలో 10మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని నాగలాపురం మండలం సద్దికూడు మడుగు ప్రాంతంలో డీఎస్పీ మురళీదర్ అధ్వర్యంలో ఆర్ఐ కృపానంద టీమ్ కూంబింగ్ చేపట్టిందని తెలిపారు. బీరకుప్పం ప్రాంతం చేరుకునే సమయానికి 10మంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారని… వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. అయితే టాస్క్ ఫోర్సు టీమ్ వారిని వెంబడించి పట్టుకోగలిగారు. వారిని కే.శివప్రసాద్ (23), ఎన్.శివకుమార్ (28), ఎన్.సుబ్రమణ్యం(43), కాగితాల లోకేష్(29), కే.రఘువర్మ (21), కడియాల కుమార్ (22), వి.నరసింహులు(39), చదల నరసింహ (21), నలుగురి అశోక్ (29), నానుమంగళం మునస్వామి (64)లుగా గుర్తించినట్లు తెలిపారు. వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. దుంగలు 236కిలోలు ఉన్నాయని, వాటి విలువ సుమారు రూ.50లక్షలు ఉంటుందని తెలిపారు. అరెస్టు చేసిన వారిపై టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

  Last Updated: 06 Sep 2022, 03:25 PM IST