తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏదైనా అంశాన్ని ప్రస్తావించడంటే..దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. టీడీపీ ఈ పేపర్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ఆయన తీసుకొచ్చాడు. అంతేకాదు, సినిమా వాళ్ల వ్యవహారాన్ని కూడా ఎత్తిపొడిచాడు. అంటే, భవిష్యత్ రాజకీయాలను ఆలోచించి ఆయన అలాంటి కామెంట్లు చేసి ఉంటారని టాక్.సినిమా వాళ్లు చంద్రబాబును రాజకీయంగా బాగా వాడుకున్నారు. కానీ, సినిమా హీరోల కారణంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రత్యేక లాభం ఏమీలేదు. చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపీ వచ్చినప్పటి నుంచి అనేక మంది సినీ నటులకు పదవులను ఇచ్చాడు. ఆ జాబితాలో మోహన్ బాబు, మురళీమోహన్, బాబూమోహన్, కైకాల సత్యానారాయణ, కోటా శ్రీనివాసరావు, హరిక్రిష్ణ, బాలక్రిష్ణ, రోజా, జయప్రద, సురేష్ బాబు, హేమ, జీవితారాజశేఖర్, ఊర్వశి శారద, ఆలీ, ఏవీఎస్, వేణుమాధవ్, రాఘవేంద్రరావు, బోయపాటి తదితరులు ఉన్నారు. వీళ్లలో కొందరు ప్రత్యక్షంగా పదవులను అనుభవించారు. మరికొందరు పరోక్షంగా చంద్రబాబు వద్ద లబ్దిపొందారు. మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బ్లడ్ బ్యాంకు కోసం పరోక్షంగా చంద్రబాబు అండను తీసుకున్నాడని టాలీవుడ్‌కు తెలియని అంశం కాదు. ఇలా…అనేక మంది సినీ నటులు తెలుగుదేశం నీడన బతికారు. కానీ, ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ఏనాడూ ముందుకు రాలేదు. పైగా కొందరు వ్యతిరేకంగా పనిచేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు వ్యక్తపరిచాడు.
స్వర్గీయ ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో సినిమాలను తీశారు. మండలాధీశుడు సినిమాలో కోట శ్రీనివాసరావు నటించాడు. గండిపేట రహస్యం, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి , కలియుగ విశ్వామిత్ర తదితర సినిమాలను హీరో క్రిష్ణ ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించారు. తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ ఆనాడు వ్యతిరేకంగా సినిమాలను తీయించింది. అదే విధంగా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలను వైసీపీ అండతో వర్మ తీశాడు. అటు ఎన్టీఆర్ హయాంలోనూ ఇటు చంద్రబాబు టైంలోనూ సినిమా పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. ఆ విషయాన్ని చంద్రబాబు మీడియా ముందు అవలోకనం చేసుకున్నాడు.సినిమా వాళ్ల కారణంగా నష్టం మినహా రాజకీయంగా ఎలాంటి లాభంలేదని చంద్రబాబుకు ఇప్పటికి బోధపడింది. ఆ సందర్భంగా 2009 ఎన్నికలను ప్రస్తావించాడు. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుండా ఉంటే, టీడీపీ అధికారంలోకి వచ్చేది. ఆ విషయాన్ని పలు మీడియా సంస్థలు ఆనాడు విశ్లేషణ చేశాయి. అదే విషయాన్ని బాబు గుర్తు చేశాడు. వాస్తవంగా మహా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆనాటి సర్వేల సారాంశం. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకును ప్రజారాజ్యం పార్టీ చీల్చుకుంది. ప్రత్యేకించి ఏపీలో భారీగా ఓట్లను చీల్చుకోవడంతో 18 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన పార్టీగా తెలుగుదేశం పార్టీని ఏపీ ఓటర్లు వ్యతిరేకించారు. ఫలితంగా టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కారణంగా 40 స్థానాల్లో టీడీపీ ఓటమి చెందిందని అంచనా. అంతేకాకుండా టీడీపీ గెలుపుపై అనుమానాలు వచ్చేలా మైండ్ గేమ్ నడిచింది. సీన్ కట్ చేస్తే..2019 ఎన్నికల్లో 23 స్థానాలకు టీడీపీ పరిమితం అయింది. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల దిశగా వెళుతోన్న ఏపీ రాజకీయాలపై చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడు. ఆనాడు చిరంజీవి మాదిరిగా ఇప్పుడు మళ్లీ పవన్ 2024కు సిద్ధం అవుతున్నాడని విశ్లేషకుల అంచనా. సో..మళ్లీ నష్టపోకుండా ఉండాలంటే..ఏదో రకంగా పవన్ తో పొత్తు పెట్టుకోవడమే మార్గంగా టీడీపీ వర్గాల భావన. ఇలా..పలు కోణాల నుంచి ఆలోచించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ వెళుతోన్న క్రమంలో జరిగిన కొన్ని చారిత్రక తప్పిదాలను అవలోకనం చేసుకున్నాడు. భవిష్యత్ లో అలాంటివి పునరావృతం కాకుండా ఉంటే ఏపీ బాగుపడుతుంది..లేదంటే తనకు వచ్చే నష్టం ఏమీలేదని చంద్రబాబు చెప్పడం కొసమెరుపు.
