Site icon HashtagU Telugu

Deaths in Andhra Pradesh : ‘క‌ల్తీసారా’మ‌ర‌ణాల్లోని ‘మ‌ర్మం’

Jagan Chandrababu

Jagan Chandrababu

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన మ‌ర‌ణాలు స‌హ‌జ‌మైన‌వా? క‌ల్తీ సారా మ‌ర‌ణాలా? టీడీపీ చెబుతున్న‌ట్టు ప్ర‌భుత్వ‌ హ‌త్య‌లా? ఇలాంటి ప్ర‌శ్న‌ల చుట్టూ గ‌త రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీ ద‌ద్ద‌రిల్లుతోంది. వాయిదా తీర్మానం ద్వారా క‌ల్లీ సారా మ‌ర‌ణాల‌పై చ‌ర్చించాల‌ని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప‌ట్టుబ‌ట్టాడు. ఆ కార‌ణంగా కొంద‌ర్ని సోమ‌వారం మ‌రికొంద‌రు స‌భ్యుల‌ను మంగళ‌వారం స‌స్సెండ్ చేస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నాడు. సభానాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్ ఆదేశం మేర‌కు త‌మ్మినేని టీడీపీ స‌భ్యుల‌ను అసెంబ్లీ బ‌య‌ట‌కు పంపాడు. కానీ, జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాలపై ఉన్న సందేహాలు మాత్రం నివృత్తి కాలేదు.ఏపీ ప్ర‌భుత్వం ఆ మ‌ర‌ణాల‌పై ప్ర‌త్యేక అధికారుల బృందాన్ని విచార‌ణ‌కు పంపింది. ప్రాథ‌మిక అధ్య‌య‌నం త‌రువాత‌ మరణాల వెనుక‌ పలు కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల కొన్ని మరణాలు చోటు చేసుకొన్నాయని కూడా వాళ్లు భావిస్తున్నారు. విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు కూడా సీఎం జ‌గ‌న్ ఆగ‌లేక‌పోయాడు. అసెంబ్లీ సాక్షింగా జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాలు స‌హ‌జ‌మైన‌విగా చెబుతున్నాడు. ఇంకో వైపు మ‌ర‌ణాల‌కు కార‌కులుగా కొంద‌రు అధికారుల‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది. సుమారు 25 మంది క‌ల్తీ సారా తాగ‌డం కార‌ణంగా చనిపోయార‌ని టీడీపీ చెబుతోంది. కానీ, 10 వ‌ర‌కు క‌ల్తీ సారాకు బ‌లయ్యార‌ని స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ మరణాలపై ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్ జంగారెడ్డి గూడెంకు వెళ్లింది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు వెళ్లి ఈ టీం వివ‌రాల‌ను సేక‌రిస్తోంది. మృతి చెందిన వారిలో ముగ్గురికి మాత్రమే మ‌ద్యం తాగే అల‌వాటు ఉంద‌ని టీమ్ సేక‌రించిన స‌మాచారంలో ఉంద‌ని తెలుస్తోంది. ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని, మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు కూడా మృతుల జాబితాలో ఉన్నార‌ని ఆ టీమ్ తేల్చింది.ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గ‌త గురువారం ఒక‌రు హాస్పిట్ ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. కల్తీ సారా తాగిన కార‌ణంగా చ‌నిపోయార‌ని మృతుల కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.

జంగారెడ్డి గూడెం మరణాలపై సీఎం జ‌గ‌న్ మాత్రం విచిత్రంగా అసెంబ్లీ వేదిక‌గా మాట్లాడాడు. 55 వేల జనాభా ఉండే జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతంలో సారా తయారు చేయ‌డం అసాధ్య‌మంటూ చెబుతున్నాడు. మారుమూల గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారంటే నమ్మొచ్చని, పురపాలక వ్యవస్థ, పోలీస్ స్టేషన్, వార్డు సచివాలయాలు ఉన్న ప్రాంతాల్లో సారా తయారీ సాధ్యమయ్యే పనేనా? అంటూ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాన్ని నిల‌దీస్తున్నాడు. జంగారెడ్డిగూడెంలో ఎందుకు చనిపోయారన్నది వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అంత్యక్రియలు పూర్తికాని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామ‌ని జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా చెప్పాడు. అంటే, విచార‌ణ బృందం నివేదిక చ‌ద‌వ‌కుండానే జ‌గ‌న్ సాధార‌ణ మ‌ర‌ణాల‌కు నిర్థారిస్తున్నాడు. వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డానికి జగన్ మంగ‌ళ‌వారం వైద్యఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని, జిల్లాకు చెందిన మంత్రి పేర్నినాని, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామితో భేటీ అయ్యాడు. స‌హ‌జ మ‌ర‌ణాలుగా చెబుతోన్న సీఎం జ‌గ‌న్ మంత్రుల‌తో ఎందుకు స‌మావేశం ఏర్పాటు చేసుకున్న‌ట్టు? విచార‌ణ‌కు ఆదేశించిన ప్ర‌భుత్వ టీమ్ నివేదిక ఇవ్వ‌కుండానే అబ‌ద్దాలు జ‌గ‌న్ ఎందుకు చెబుతున్నాడు? క‌ల్తీసారా మ‌ర‌ణాలు కాక‌పోతే స్థానిక అధికారులు కొంద‌ర్ని ఇదే అంశంపై ఎందుకు స‌స్సెండ్ చేశారు? హెల్త్ క్యాంపులు పెట్టి ఎందుకు ప్ర‌భుత్వం హ‌డావుడి చేస్తుంది? చంద్ర‌బాబు నాయుడు జంగారెడ్డి గూడెం వెళ్లిన త‌రువాత జ‌గ‌న్ స‌ర్కార్ హైరానా ఎందుకు ప‌డుతుంది? ఇలాంటి ప్ర‌శ్న‌లు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. వీటికి నిజ‌మైన స‌మాధానాలు చెప్పాల్సిన బాధ్య‌త జ‌గ‌న్ పై ఉంది. ప్ర‌భుత్వం విచార‌ణ కోసం నియ‌మించిన అధికారుల బృందం నివేదిక ఇవ్వ‌కుండానే సాధార‌ణ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రించ‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఏమిటో..తెలియాలి.!