Site icon HashtagU Telugu

Davos : నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రం: లోకేశ్‌

R&D center in AP to contribute to knowledge economy: Lokesh

R&D center in AP to contribute to knowledge economy: Lokesh

Davos : ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ టైర్ల తయారీలో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ కన్వర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ..ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలన్నారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయమని లోకేశ్‌ కోరారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయాలన్నారు. స్థిరమైన సప్లయ్ చైన్ నిర్థారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్ధతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టమని కోరారు. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్గో పాల్గొనాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి ఈ మేరకు చేశారు.

ఇక, అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ మాట్లాడుతూ… అపోలో టైర్స్, వ్రేడెస్టెయిన్ బ్రాండ్‌ల క్రింద 100కి పైగా దేశాల్లో అనేక రకాల టైర్ ఉత్పత్తులను తమ సంస్థ మార్కెట్ చేస్తుందని తెలిపారు. US$ 2.3 బిలియన్ల టర్నోవర్‌తో అపోలో టైర్స్ టాప్ 20 గ్లోబల్ టైర్ తయారీదారులలో ఒకటిగా ఉందన్నారు. తమ కంపెనీ జర్మనీలోని Reifencom GmbH, నెదర్లాండ్స్‌లోని అపోలో వ్రేడెస్టీన్ BV కొనుగోళ్ల ద్వారా విస్తరించినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీరజ్ కన్వర్ తెలిపారు.

మరోవైపు లోకేశ్‌ సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో క్యాంప్ బెల్ విల్సన్‌ కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి విమానాశ్రయం గ్లోబల్ ఏవియేషన్‌లో కీలకపాత్ర వహించటంతో పాటు ఏపీకి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు వస్తాయని లోకేష్ అన్నారు. అలాగే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్ హబ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేగాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ప్రతిపాదిత హబ్‌తో ఉపాధి అవకాశాలు కలగటంతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పైలట్లు, స్టీవార్డెస్, టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Read Also: Republic Day 2025 : గణతంత్ర పరేడ్లో ఏపీ శకటం