Site icon HashtagU Telugu

AP New Districts: సీమ‌కు వ‌చ్చిన స‌ముద్రం..!

Andhra Pradesh Rayalaseema Sea Cost

Andhra Pradesh Rayalaseema Sea Cost

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈరోజు కొత్త జిల్లాల‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఈరోజు నుంచే 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. అయితే ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సీమకు తీర ప్రాంతం వచ్చింది.

ఏపీలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం అనే విష‌యం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. అయితే ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా మిగిలింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి.ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.

ఇక తిరుపతి జిల్లా పూర్తిగా అటు రాయలసీమ ప్రాంతం కాదు.. ఇటు కోస్తా ప్రాంత‌మూ కాదు. గ‌తంలో నెల్లూరు జిల్లాను పూర్తిగా కోస్తా ప్రాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొంత ప్రాంతం తిరుపతి జిల్లాలోకి వెళ్ళింది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, గూడురు నియోజకవర్గాల్లో బీచ్‌లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ బీచ్‌ తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. దీంతో ఫ‌స్ట్‌టైమ్ రాయలసీమకు సముద్రం వచ్చినట్టైంది. ఇక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త శకం ప్రారంభం కాబోతోంద‌ని, పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జగన్ అన్నారు.