ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా విధానంలో జూన్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు చేపట్టుతోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రేషన్ సరుకులు సంబంధిత రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయబడతాయి. వృద్ధులు, దివ్యాంగులు మాత్రమే డోర్ డెలివరీ సేవలు పొందగలుగుతారు. మిగతా అన్ని రేషన్ కార్డుదారులు తమకు నియమించబడిన రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల సరుకుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అవకతవకలకు అవకాశం ఉండదని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Electricity Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే ఈ తప్పు చేస్తున్నారేమో చూడండి!
గతంలో ఉపయోగించిన ఎండీయూ వాహనాల ద్వారా సరుకుల పంపిణీ పద్ధతిలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, బియ్యం అక్రమ రవాణా, సరుకుల మళ్లింపు లాంటి సమస్యలు తలెత్తాయని మంత్రి మండిపడ్డారు. అందువల్లే ఎండీయూ వాహనాలను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే వాహనాలు కొనుగోలు చేసిన వారికి నష్టం కలగకుండా చూడాలని మంత్రి హామీ ఇచ్చారు. వారు చెల్లించిన వాహన ధరలో 10% మినహాయించి, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా చెల్లించి వాహనాలను వారికే అప్పగించనున్నట్లు తెలిపారు.
ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు తెరిచి పనిచేయనున్నాయి. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్ మిషన్ అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాక, నిత్యావసరాల ధరలు పెరిగిన సందర్భాల్లో సబ్సిడీ ధరలకు సరుకులను అందించనున్నామని హామీ ఇచ్చారు. కొత్త విధానంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీలైన సమయంలో రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. అక్రమ రవాణా, మధ్యవర్తుల లాభదోపిడీకి ఇది చెక్ పెట్టే మార్గమని మంత్రి స్పష్టం చేశారు.