Ramgopal Varma : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మూడు కేసుల్లో నాయ్యస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా మద్దిపాడుతోపాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. వీటీపై విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ఆర్టీవీ హైకోర్టును ఆశ్రయించారు. వర్మపై శుక్రవారం వరకు వరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది. నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇకపోతే..మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మని విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు.