Ramayapatnam Port : రామాయపట్నం పోర్టు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోర్ట్ కనెక్టివిటీ పెంపు, మౌలిక వసతుల మెరుగుదలపై సుదీర్ఘంగా వాయిదా పడుతున్న అంశాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పోర్టు కనెక్టివిటీ, డ్రెడ్జింగ్, రోడ్డు-రైలు మౌలిక వసతులపై ప్రతిపాదనల పరిశీలన కోసం ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ ఉపసంఘాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి, మౌలిక వసతులు , పెట్టుబడుల శాఖ మంత్రి, అలాగే పర్యాటక శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉపసంఘం రామాయపట్నం పోర్టు ప్రాజెక్టులో కీలక అంశాలైన పునరుద్ధరణ, డ్రెడ్జింగ్ పనులు, అంతర్గత రహదారులు, బాహ్య కనెక్టివిటీ (రోడ్డు & రైలు) అంశాలను సమగ్రంగా పరిశీలించనుంది.
ప్రాజెక్టు ఫేజ్-1లో చేపట్టిన నిర్మాణ పనులకు కావలసిన గడువు పొడిగింపుపై కూడా ఉపసంఘం తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించనుంది. వీటిపై తగిన సిఫార్సులు చేసి, అమలు కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేయనున్నట్లు పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన స్పష్టంగా ఆదేశించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా పోర్టు కనెక్టివిటీ అత్యంత కీలకం. రామాయపట్నం పోర్టును ప్రాంతీయ స్థాయి నౌకాశ్రయంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది కీలక ముందడుగు. కనెక్టివిటీ మెరుగుపడితే, కార్గో మౌవ్‌మెంట్, పారిశ్రామిక విస్తరణకు దోహదం చేయగలదన్నది ప్రభుత్వ అంచనా. ఈ చర్యలతో రామాయపట్నం పోర్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపు తిప్పే ప్రాజెక్టుగా మారే అవకాశముంది.
Maoist Leader : మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. జేజెఎంపీ కీలక నేత లొంగుబాటు