Site icon HashtagU Telugu

Ramana Deekshitulu : ‘ర‌ణ’ దీక్షితులు!

Ramana Deekshitulu

Ramana Deekshitulu

నాడు బాబు నేడు జ‌గ‌న్‌ఏపీ స‌ర్కార్ మీద తిరుమ‌ల తిరుప‌తి ఆగ‌మశాస్త్ర‌ స‌ల‌హా మండ‌లి స‌భ్యుడు, శ్రీవారి గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్ష‌లు స్వ‌రం మారుతోంది. వంశ‌పారంప‌ర్య అర్చ‌కుల విష‌యంలో తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ ట్వీట్ చేశాడు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను సైతం ధిక్క‌రించి అర్చ‌క వ్య‌వ‌స్థ‌కు విఘాతం క‌లిగేలా అర్చ‌కుల్ని ఉద్యోగులుగా గుర్తించార‌ని ఫైర్ అయ్యాడు. దీనిపై కోర్టుకు వెళ్లాడ‌మే మార్గ‌మా? అంటూ ట్వీట్ చేస్తూ బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామికి టాగ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.మాజీ సీఎం చంద్ర‌బాబు, టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితులు ఎస్వీ యూనివ‌ర్సిటీలో స‌హ విద్యార్థులు. కాలేజి రోజుల నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా స‌న్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ, 2018లో వంశ‌పారంప‌ర్య అర్చ‌కుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 65గా నిర్థారించ‌డంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్యా బెడిసింది. ఆనాటి నుంచి చంద్ర‌బాబుపై రివ‌ర్స్ అయ్యాడు. ప‌లు ఆరోప‌ణ‌ల‌ను చంద్ర‌బాబు మీద చేశాడు. గులాబీ వ‌జ్రం(పింక్ డైమండ్‌) నుంచి శ్రీవారి ఆభ‌ర‌ణాల మాయం వ‌ర‌కు తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించాడు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గుప్త నిధుల కోసం శ్రీవారి ఆల‌యంలో త‌వ్వ‌కాలు జ‌రిపిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి వద్ద రూ. 50 కోట్ల విలువైన శ్రీవారి నగలను బాబు దాచి పెట్టారని అప్ప‌ట్లో ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోపించాడు. శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాల్లో పదిశాతం కూడా ఇప్పుడు లేవని ఆవేద‌న వెలిబుచ్చాడు. శ్రీవారికి పల్లవ, చోళ రాజులు సమర్పించిన విలువైన ఆభరణాల కోసం శ్రీవారి పోటును చంద్ర‌బాబు త‌వ్విస్తున్నాడ‌ని తీవ్రంగా మీడియా ఎదుట స్పందించాడు. వీట‌న్నింటిపైనా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం న్యాయ‌పోరాటానికి దిగుతూ ఆనాడు పిటిష‌న్ వేసింది. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత ఆ పిటిష‌న్ ను ఉప‌సంహ‌రించుకుంది. దీంతో ర‌మ‌ణ‌దీక్షితులు ఊపిరి పీల్చుకున్నాడు.వంశ‌పారంపర్య అర్చ‌కుల విష‌యంలో 2018న టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ మార్చేసింది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చ‌కుల‌ను తిరిగి విధుల్లోకి తీసుకునేలా వైసీపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో ఆగ‌మ‌శాస్త్ర స‌ల‌హా మండ‌లి స‌భ్యులుగా, గౌరవ ప్ర‌ధాన అర్చ‌కుని హోదాలో ర‌మ‌ణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరాడు. అందుకు ఉడ‌తా భ‌క్తిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విష్ణుమూర్తిలా ధ‌ర్మాన్ని ర‌క్షిస్తున్నాడ‌ని కొనియాడుతూ సంచ‌ల‌నం సృష్టించాడు. మ‌రో 30 ఏళ్ల వ‌ర‌కు జ‌గ‌న్ సీఎంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తూ దీవించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, 2018లో కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల మేర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా అర్చ‌కుల‌ను టీటీడీ ప‌రిగ‌ణిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో వంశ‌పారంప‌ర్య అర్చ‌క‌త్వం మ‌రోసారి ప్ర‌శ్నార్థం అయింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కార్ ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ ర‌మ‌ణ‌దీక్షితులు ట్వీట్ చేయ‌డంతో పాటు సుబ్ర‌మణ్య‌స్వామికి టాగ్ చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. సో..నాడు చంద్ర‌బాబు మీద పోరాడిన ర‌మ‌ణ‌దీక్షితులు నేడు జ‌గ‌న్ స‌ర్కార్ పై తిరుగుబాటు సంకేతాలిచ్చాడా? అనే భావ‌న అర్చ‌కుల్లో క‌లుగుతోంది.