Vijay Sai Reddy : విజ‌యసాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ‌?

వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ దాదాపు ఖాయం అయింద‌ని తెలుస్తోంది. తొలిసారి రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఆయ‌న చేసిన ప‌నితీరు ఆధారంగా రెండోసారి ఇవ్వాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 12:33 PM IST

వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ దాదాపు ఖాయం అయింద‌ని తెలుస్తోంది. తొలిసారి రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఆయ‌న చేసిన ప‌నితీరు ఆధారంగా రెండోసారి ఇవ్వాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. కేంద్రంతో ఆయ‌న న‌డిపిన లాబీయింగ్ వైసీసీకి, జ‌గ‌న్ కు మ‌ధ్య పూల‌బాట వేసింది. ఒక‌టి రెండు సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ విష‌యంలో బెడిసికొట్టిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత అన్నీ స‌ర్దుకున్నాయి. దీంతో రాజ్య‌స‌భ స‌భ్యునిగా విజ‌య‌సాయిరెడ్డికి మంచి మార్కులు సంపాదించార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయ‌న‌కు పోటీగా ఉండే వైవీ సుబ్బారెడ్డి ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్ గా రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దీంతో మ‌రోసారి విజ‌యసాయిరెడ్డికి రాజ్య‌స‌భ ఖ‌రారు అయింద‌ని వినికిడి.

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానంగా రెండు అంశాల‌పై క్లారిటీకి రానున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి అనుకూలంగా ఓటు వేయాల‌ని నిర్ణ‌యించ‌డం, రాజ్య‌స‌భ స‌భ స‌భ్య‌త్వ కోటాను బీజేపీ చెప్పిన వాళ్ల‌కు ఒక‌రికి ఇవ్వ‌డం. ఈ రెండు విష‌యాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, బీజేపీ మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఢిల్లీ బీజేపీ చెప్పిన‌ట్టు ముఖేష్ అంబానీ కోటా కింద ప‌రిమ‌ళ న‌త్వానికి రాజ్య‌స‌భ‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. ఈసారి ఆదానీ గ్రూప్ కోటా కింద గౌతమ్ ఆదానీ సతీమణి ప్రీతి ఆదానీ కి రాజ్య‌స‌భ‌ను ఇవ్వాల‌ని బీజేపీ కోరింద‌ని స‌మాచారం. ఆ మేర‌కు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాజ్య‌స‌భ సీట్లు ఈసారి వ‌స్తాయి. న‌లుగురిలో ఒక‌రు విజ‌య‌సాయిరెడ్డికాగా, ఆదానీ గ్రూప్ కు చెందిన ప్రీతి ఆదానీకి మ‌రొక‌టి ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. మిగిలిన రెండు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌ను బీసీ, ఎస్సీల‌కు ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అవుతున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఏపీ క్యాబినెట్ రెండో విడ‌త కూర్పును గ‌మ‌నిస్తే, కుబేరులుగా ఉన్న బీసీలు, ఎస్సీల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించారు. ఆ కోణం నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక కూడా ఉంటుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కుబేరుల జాబితాలోని బీసీ నాయ‌కుల్లో ప్ర‌ధ‌మంగా బీద మ‌స్తాన్ రావు పేరు క‌నిపిస్తోంది. గ‌తంలోనే ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ఆశించారు. కానీ, టీడీపీ నుంచి అప్పుడే వ‌చ్చిన మ‌స్తాన్ రావును వెంట‌నే ఎంపీగా నియ‌మిస్తే ప్ర‌తికూల సంకేతం వెళుతుంద‌ని ఆగారు. ఈసారి ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇస్తార‌ని బీసీ వ‌ర్గాల్లో టాక్‌. బీసీ వ‌ర్గాల్లో బీద మస్తాన్ రావు కంటే కుబేరులుగా ఉన్న వాళ్లు ఇంకా ఎవ‌రైనా ఉంటే ఆయ‌న పేరు వెన‌క్కు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఎస్సీ కోటా కింద మాల సామాజిక‌వ‌ర్గానికి ఈసారి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్దం అయ్యార‌ని పార్టీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాల చ‌ర్చ‌. ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వాళ్లు అనేక మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన ఎస్సీ ల్లో ఎక్కువ మంది ఆర్థికంగా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వాళ్లే. ఆయ‌న తొలి మంత్రి వ‌ర్గంలోనూ, రెండోసారి మంత్రివ‌ర్గంలోనూ మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఎస్సీ మాల సామాజిక వ‌ర్గం నేత‌లు కుబేరులు. ఉదాహ‌ర‌ణ‌కు మంత్రి సురేష్ ను ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి తీసుకోవ‌చ్చు. ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఎస్సీల‌ను ఎవ‌రినైనా ఎంపిక చేయాలంటే వాళ్ల ఆర్థిక ప‌రిస్థితి ఉన్న‌తంగా ఉండాల్సిందే. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన మాల సామాజిక‌వ‌ర్గం సివిల్ స‌ర్వెంట్లు చాలా మంది కుబేరులు ఉన్నారు. వాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రికి జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది.

ఒక వేళ మైనార్టీల‌కు రాజ్య‌స‌భ‌ను ఇవ్వాల‌నుకుంటే టాలీవుడ్ కుబేరునిగా ఉన్న ఆలీ పేరు ప్ర‌ముఖంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. చాలా కాలంగా ఆయ‌న కీల‌క ప‌ద‌విని ఆశిస్తున్నారు. ఆ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిను అభ్య‌ర్థించిన విష‌యం చాలా సంద‌ర్బాల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. టాలీవుడ్ ను దూరంగా పెడుతోన్న జ‌గ‌న్ ఈసారి ఆలీకి రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా స‌రికొత్త పంథాలో వెళ్లే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఆలీకి రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా మైనార్టీ, సినీ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌ను తొలి నుంచి జ‌గ‌న్ దూరంగా పెడుతున్నారు. చిన్న‌నాటి స్నేహితుల మాదిరిగా ఉన్న నాగార్జున, బంధువులుగా ఉన్న మోహ‌న్ బాబు తదిత‌రుల‌తో మిన‌హా సినీ వ‌ర్గాల‌ను పెద్ద‌గా ఆయ‌న ప‌ట్టించుకోరు. ఇటీవ‌ల ఆయ‌న వ‌ద్ద‌కు ప్ర‌ముఖ హీరోలు వెళ్లిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితాలను సినిమా ఇండస్ట్రీ రాబ‌ట్ట‌లేక‌పోయింది. అందుకే, ఆలీకి రాజ్య‌స‌భ లాంటి పెద్ద ప‌ద‌వి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇస్తార‌ని ఎక్కువ మంది న‌మ్మ‌డంలేదు.

మైనార్టీ వ‌ర్గాల్లో పారిశ్రామిక వేత్తలుగా ఉన్న వాళ్లు వైసీపీలో ఉన్నారు. కుబేరులుగా ఉంటూ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఆ పార్టీలో కొంద‌రు ఉన్నారు. పార్టీలో లేక‌పోయిన‌ప్ప‌టికీ మైనార్టీ పారిశ్రామికవేత్త‌ను ఎంపిక చేసినా ఆశ్చ‌ర్యం లేదు. మొత్తంగా ఎస్సీ, బీసీ, మైనార్టీల్లోని కుబేరుల జాబితాను వైసీపీ అన్వేషిస్తోంది. ఆ వ‌ర్గాల‌కు చెందిన వాళ్ల‌కు రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా సామాజిక ఈక్వేష‌న్ చూపించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు, కుబేరులుగా ఉండే ఆ సామాజిక‌వ‌ర్గం నేత‌లు పార్టీ ఫండ్ లేదా ఇత‌ర‌త్రా రూపంలో ఆర్థికంగా ఆదుకుంటారు. స్వామి కార్యం స్వ‌కార్యం రెండూ క‌లిసి వ‌చ్చేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల ఎంపిక విష‌యంలో అడుగు వేస్తార‌ని ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గం కూర్పు ఆధారంగా స్ప‌ష్టం అవుతోంది.

మొత్తం నాలుగు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఎంపిక చేసుకునే వెసుల‌బాటు ఉన్న‌ప్ప‌టికీ ఒక‌టి ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల కోటా ఉండ‌నుంది. పైగా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న గౌతమ్ ఆదానీ కుటుంబానికి రాజ్య‌స‌భ ఇవ్వ‌డానికి ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌రు. ఇప్ప‌టికే ఆదానీ స‌తీమ‌ణి ప్రీతి ఆదానీ పేరు ఖరారు చేసినట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. రిలయన్స్ సంస్థల అధినేత, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి క‌ల‌వ‌డంతో రాజ్య‌స‌భ ఖ‌రారు అయింది. ఆదానీ గ్రూప్ కు ఈసారి రాజ్య‌స‌భ‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇస్తే, దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల వైసీపీలో ఉన్న‌ట్టే. అంతేకాదు, సీఎం జగన్ టీం మెంబర్స్ అవుతారు. జాతీయ పార్టీలను కాద‌ని వైసీపీ నుంచి పారిశ్రామిక దిగ్గ‌జాలు రాజ్యసభను ఎంచుకోవటం సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మే.