ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి రుజువు చేసారు ఈ వృద్దులు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఏ కుమారులు , కూతుళ్లు చూడడం లేదనే సంగతి తెలిసిందే. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేసే కుమారులు, అత్తామామలను చూసుకోలేని కోడళ్లు రోజు రోజుకు ఎక్కువై పోతుండడం తో వృద్ధాశ్రమలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదే తరుణంలో వృద్ధాశ్రమంలో ప్రేమలు కూడా చిగురిస్తున్నాయి. తాజాగా రాజమహేంద్రవరంలో అదే జరిగింది. ఓ 68 ఏళ్ల వృద్ధురాలిని.. 64 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరూ ఆ ఆశ్రమంలోనే కలుసుకోగా.. వారి మనసులు కూడా కలిశాయి. చివరి వయసులో ఒకరికి మరొకరు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ ఆశ్రమ నిర్వాహకులు పెళ్లి జరిపించగా.. అందులో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి.. ఆ వృద్ధ జంటను ఒక్కటి చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంట గ్రామానికి చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ.. రాజమహేంద్రవరం నారాయణపురం గ్రామానికి చెందిన 64 ఏళ్ల మడగల మూర్తి గత కొద్దీ రోజులుగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మనసులు కలుసుకున్నాయి. చివరి దశలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తతం మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయనకు ఎవరో ఒకరి సాయం లేనిది.. ఏ పని చేసుకోలేడు. ఆ సమయంలో మూర్తికి రాములమ్మ అన్ని రకాల సహయ సహకారాలు అందిస్తూ వస్తుంది. దీంతో ఆయన క్రమంగా కోలుకున్నాడు. తనకు ఎవరూ లేని వయసులో తోడుగా నిలిచినందుకు రాములమ్మపై మూర్తికి ప్రేమ, అభిమానం పెరిగాయి. ఇక రాములమ్మకు కూడా మూర్తిపై మంచి అభిప్రాయం ఉంది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక ఇదే విషయాన్ని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమాన్ని నడిపిస్తున్న గుబ్బల రాంబాబుకు చెప్పడం తో శుక్రవారం రోజున మూర్తి-రాములమ్మ దంపతులకు దగ్గరుండి అదే ఆశ్రమంలో వివాహం జరిపించారు.