AP Politics : జ‌గ‌న్ దారి గోదారే! `మ‌హాపాద‌యాత్ర‌`కు బ్రిడ్జి బ్రేక్!!

గోదావ‌రి రోడ్డు క‌మ్ రైలు వంతెన రాజ‌కీయ బ‌ల‌నిరూప‌ణ‌కు కేంద్రం అయింది. అప్ప‌ట్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర సంద‌ర్భంగా బ్రిడ్జి ఊగిపోయేలా జ‌నం హాజ‌ర‌య్యారు.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 02:45 PM IST

గోదావ‌రి రోడ్డు క‌మ్ రైలు వంతెన రాజ‌కీయ బ‌ల‌నిరూప‌ణ‌కు కేంద్రం అయింది. అప్ప‌ట్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర సంద‌ర్భంగా బ్రిడ్జి ఊగిపోయేలా జ‌నం హాజ‌ర‌య్యారు. ఆ దృశ్యాల‌ను ప్ర‌దర్శించ‌డం ద్వారా `ఓదార్పు` స‌క్సెస్ ను కొన‌మానంగా ఇప్ప‌టికీ వైసీపీ చూపుతోంది. ఇక జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆ బ్రిడ్జి మీద క‌వాతు నిర్వ‌హించారు. రోడ్ల దుస్థితికి నిర‌స‌న‌గా ఆయ‌న చేసిన క‌వాతుకు గోదావ‌రి బ్రిడ్జి వేదిక అయింది. ఇప్పుడు మ‌ళ్లీ గోదావ‌రి బ్రిడ్జి మీద నుంచి మ‌హాపాద‌యాత్ర సాగ‌డానికి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డింది. స‌రిగ్గా ఆ రోజు నుంచి బ్రిడ్జిని మూసివేస్తూ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరగాల్సి ఉంది. అందుకే, దాన్ని అడ్డుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశానుసారం బ్రిడ్జిని మూసివేస్తూ క‌లెక్ట‌ర్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని బుచ్చయ్య చౌదరి ఘాటుగా ట్వీట్ చేశారు. ‘కొంచెం అయినా సిగ్గుండాలి’ అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లు గుర్తుకురాని రైల్వే బ్రిడ్జి మరమ్మతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే గుర్తొచ్చాయా? అంటూ నిలదీశారు. రైతుల పాదయాత్ర ఇటుగా వస్తుంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల పేరుతో మూసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఏంచేసేవాళ్లు? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. శాడిస్టు ఆలోచనలు తప్పిస్తే మరొకటి కాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై అత్యవసర మరమ్మతుల నిమిత్తం శుక్ర‌వారం నుంచి అంటే అక్టోబర్‌ 14న ఒక్కరోజు మూసివేయనున్న‌ట్టు జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ప్ర‌క‌టిస్తూ, షెడ్యూల్‌ ప్రకారం రైళ్లు నడుస్తాయని తెలిపారు. మ‌ర‌మ్మ‌త పనులు పూర్తయ్యే వరకు వంతెనపై రాజమండ్రి-కొవ్వూరు మధ్య వాహనాల రాకపోకలను మళ్లిస్తామని ఆమె తెలిపారు. ద్విచక్ర వాహనాలను సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వైపు మళ్లిస్తామని, ఇతర రవాణా వాహనాలను నగరంలోని నాలుగో వంతెన వైపు మళ్లిస్తామని చెప్పారు. అధికారికంగా మ‌ర‌మ్మ‌తుల వ్య‌వ‌హారాన్ని యంత్రాంగం చెబుతున్న‌ప్ప‌టికీ మ‌హాపాద‌యాత్రను బ్రిడ్జి మీదుగా వెళ్ల‌కుండా చేయ‌డానికి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌తంలో జ‌గ‌న్, ప‌వ‌న్ కు ల‌భించిన అవ‌కాశం రైతుల‌కు లేకుండా పోయిన‌ట్టు అయింది.