Gudivada Politics: గుడివాడ రాజ‌కీయాన్ని చ‌ల్లార్చిన ప్ర‌కృతి

తెలుగుదేశం పార్టీ, వైసీపీ మ‌ధ్య టెన్ష‌న్ క్రియేట్ చేసిన గుడివాడ మినీ మ‌హానాడు వాయిదా ప‌డింది. అత్తారింటి నుంచి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని మీద రాజ‌కీయ ఆధిప‌త్యం చూపాల‌ని భావించిన త‌మ్ముళ్ల‌కు ప్ర‌కృతి స‌హ‌క‌రించ‌లేదు.

  • Written By:
  • Updated On - June 29, 2022 / 03:01 PM IST

తెలుగుదేశం పార్టీ, వైసీపీ మ‌ధ్య టెన్ష‌న్ క్రియేట్ చేసిన గుడివాడ మినీ మ‌హానాడు వాయిదా ప‌డింది. అత్తారింటి నుంచి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని మీద రాజ‌కీయ ఆధిప‌త్యం చూపాల‌ని భావించిన త‌మ్ముళ్ల‌కు ప్ర‌కృతి స‌హ‌క‌రించ‌లేదు. వ‌ర్షం, వాతావ‌ర‌ణం బాగాలేక‌పోవ‌డంతో బుధ‌వారం నిర్వ‌హించాల్సిన మినీమ‌హానాడు వాయిదా ప‌డింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం మినీ మ‌హానాడుతో కొడాలి నోటికి తాళం వేయాల‌ని టీడీపీ ప్లాన్ చేసింది. ఆ మేర‌కు ముమ్మ‌రం ఏర్పాట్లు చేశారు. తీరా, వ‌ర్షం సూచ‌న కార‌ణంగా వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో గుడివాడ వైసీపీ తాత్కాలికంగా ఊపిరిపీల్చుకుంది.

గ‌త వారం రోజుల నుంచి ఇరు పార్టీల మ‌ధ్య గుడివాడ మినీ మ‌హానాడుపై మీడియా వేదిక‌గా ర‌చ్చ జ‌రిగింది. స‌హ‌జ‌శైలిలో చంద్రబాబుకే స‌వాల్ చేస్తూ కొడాలి మీడియా ముందుకొచ్చారు. ద‌మ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేసి గెలుపొందాల‌ని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు, కుప్పం నుంచి ఈసారి చంద్ర‌బాబు గెలుస్తాడో లేదో చూసుకోవాలంటూ సెటైర్లు వేసి మినీ మ‌హానాడు హీట్ ను పెంచారు. ఆయ‌న‌కు తోడుగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా బాస‌ట‌గా నిలుస్తూ గుడివాడ‌లో టీడీపీ అభ్య‌ర్థిని చూసుకోవాల‌ని ఎద్దేవా చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థిని చూప‌లేని టీడీపీ మినీ మ‌హానాడు నిర్వ‌హించ‌డం ద్వారా ఏమి సంకేతం ఇస్తుంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌తిగా టీడీపీ లీడ‌ర్ బుద్ధా వెంక‌న్న సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. గుడివాడ టీడీపీ అడ్డా అంటూ 2004 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చేతుల మీదుగా బీ ఫారం తీసుకున్న కొడాలిని వెన్నుపోటుదారునిగా అభివ‌ర్ణించారు. అంతేకాదు, జగన్ మోహన్ రెడ్డి త‌ల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన విష‌యాన్ని గుర్తు చేస్తూ మ‌హానాడు హిట్ అవుతుంద‌ని కొడాలికి చ‌మ‌ట‌లు ప‌ట్టాయ‌ని అన్నారు. ఇరు వ‌ర్గాలు ఇలా వారం రోజులుగా గుడివాడ రాజకీయాన్ని ఏపీ వ్యాప్తంగా హీట్ ఎక్కించారు.

తాత్కాలికంగా గుడివాడ మినీ మ‌హానాడును వాయిదా వేసిన టీడీపీ మ‌రో కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేస్తోంది. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ తొలి రోజు బహిరంగ స‌భ‌, రెండో రోజు నియోజ‌క‌వర్గాల వారీగా రివ్యూలు, మూడో రోజు రోడ్ షోల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ క్ర‌మంలో కృష్ణా జిల్లా వంతు రావ‌డంతో గుడివాడ కేంద్రంగా బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని. ప్ర‌త్యేకంగా టీడీపీ శ్ర‌ద్ధ పెట్టింది. కానీ, సోమ‌వారం నుంచి వ‌ర్షం కురుస్తుండ‌డంతో వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే, ప్ర‌స్తుతం జిల్లాల వారీగా చంద్ర‌బాబు టూర్ షెడ్యూల్ ముందుగానే రూట్ మ్యాప్ త‌యారైన క్ర‌మంలో చివ‌ర్లో వాయిదా ప‌డిన కృష్ణా జిల్లా టూర్ పెట్టాల‌ని ప్రాథ‌మికంగా టీడీపీ భావిస్తోంది. లేదంటే ఏదో ఒక వారంలో రెండు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను పెట్టుకుని కృష్ణా జిల్లాను క‌వ‌ర్ చేయాల‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ భావిస్తోంది.

కృష్ణా జిల్లాకు చెందిన మినీ మ‌హానాడును గుడివాడ‌లో ఈ నెల 29న నిర్వ‌హించ‌డం కోసం గుడివాడ స‌మీపంలో రైతు భూములు ఇవ్వ‌డంతో వేదిక ఖరారు అయింది. భూముల‌ను ఇచ్చిన రైతుల మీద వైసీపీ లీడ‌ర్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా మినీ మ‌హానాడు వేదిక కోసం రైతులు ముందుకొచ్చారు. ఒంగోలు మ‌హానాడు త‌ర‌హాలోనే సూప‌ర్ హిట్ చేయాల‌ని పక్కాగా స్కెచ్ వేసిన టీడీపీకి వ‌ర్షం అడ్డుప‌డింది. ఫ‌లితంగా కొడాలి హీటెక్కిన గుడివాడ రాజకీయం తాత్కాలికంగా చ‌ల్ల‌బ‌డింది.