ఎవరైనా తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునే వాళ్లే నిలబడగలరు. ఇదే సూత్రాన్ని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ అవలంభిస్తున్నారు. ఏపీ విభజన అంశాన్ని గుర్తు చేసుకోవడం కంటే భవిష్యత్ గురించి ఆలోచించాలని భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన అంశాలను నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.
అమరావతి రాజధాని, మూడు రాజధానుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రత్యేక హోదా ను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, రైతులు అసంతృప్తిగా ఉన్నారని జోడో యాత్ర ద్వారా అర్థం అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఏపీలో పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంకు ప్రాధాన్యం ఇస్తుందని రాహుల్ చెప్పారు. అందుకే, మిగిలిన పార్టీల్లోని లీడర్ల తరహాలో కాకుండా ఎప్పటికప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారని పేర్కొన్నారు.
రాబోవు రోజుల్లో వైసీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు అధ్యక్షుడ్ని అడగాలని రాహుల్ చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. అధ్యక్షుడి వ్యూహాల ప్రకారం పొత్తులు ఉంటాయని అన్నారు. అధ్యక్షుని డైరెక్షన్ మేరకు తన రోల్ పార్టీలో ఉంటుందని వెల్లడించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని, శశిథరూర్ ఆరోపణలను రాహుల్ కొట్టిపారేశారు. ఏపీకి న్యాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని రాహుల్ చెప్పడం కొసమెరుపు.