Site icon HashtagU Telugu

Raghurama Krishnam Raju : రాజు’ వ‌స్తున్నాడు..హో.!

Raghuramaraj

Raghuramaraj

వైసీపీ రెబ‌ల్ ఎపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సాపురం వ‌స్తున్నాడు. మూడు రోజుల పాటు భీమ‌వరంలో ఉంటున్నాడు. ఆ మూడు రోజులు ప‌గ‌డ్బంధీ ఏర్పాట్ల‌ను ముందుగా చేసుకున్నాడు. రాజ‌కీయ శ‌త్రువుల‌కు ఛాలెంజ్ విసిరాడు. ఏమి చేస్తారో…రండి అంటూ మీడియాముఖంగా స‌వాల్ విసిరాడు. ఫ‌లితంగా ఆయ‌న టూర్ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మ‌ధ్య క్లైమాక్స్ కు చేర‌నుందని టాక్‌. అక్క‌డి నుంచే రాజీనామా అస్త్రాన్ని సంధిస్తాడ‌ని అనుచ‌రులు భావిస్తున్నారు.టైం టూ టైం షెడ్యూల్ ను అధికార‌కంగా రెబ‌ల్ త్రిబుల్ ఆర్ ఢిల్లీ నుంచి సోమ‌వారం ప్ర‌క‌టించాడు. ఈనెల 13వ తేదీన ఇండిగో ఫ్లైట్ లో సొంత నియెజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్నాన‌ని వెల్ల‌డించాడు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను పాటిస్తూ నర్సాపురం ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని తెలిపాడు. సంక్రాంతి పండుగ‌ను ముగించుకుని ఈనెల 16న తిరిగి ఢిల్లీ వెళ్లే వ‌ర‌కు వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. రాజీనామా టైంను అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ సంక్రాంతి సంద‌ర్భంగా భీమవ‌రం నుంచే ఆ ప్ర‌క‌ట‌న చేస్తాడ‌ని ఆయ‌న వ‌ర్గీయుల టాక్‌.

ర‌చ్చబండ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తి రోజూ ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న మీద త్రిబుల్ ఆర్ చేస్తోన్న హ‌డావుడి ప్ర‌తిరోజూ సోష‌ల్ మీడియా వేదిక‌గా చూస్తున్నాం. ఇసుక‌, మ‌ద్యం, జ‌గ‌న‌న్న కాల‌నీలు, న‌వ‌ర‌త్నాల నుంచి సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ వ‌ర‌కు త్రిబుల్ చేసిన కామెంట్లు అంద‌రికీ తెలిసిన‌వే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కంటే ఎక్కువ‌గా జ‌గ‌న్ ను ఢీ కొట్టిన ఎంపీగా ఆయ‌నకు పేరుంది. పార్ల‌మెంట్లోనూ, బ‌య‌ట ఏపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్‌ వ్య‌క్తిత్వాన్ని వీలున్నంత డ్యామేజ్ చేసిన రెబ‌ల్ ఎంపీ త్రిబుల్ ఆర్ వైసీపీకి ప‌క్క‌లో బ‌ల్లెంగా మారాడు. ఆయ‌నపై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని స‌ర్వ‌శ‌క్తులు జ‌గ‌న్ ఒడ్డుతున్నాడు.ఏడాది కాలంగా వైసీపీ ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ త్రిబుల్ ఆర్ మీద అన‌ర్హ‌త వేటు వేయించ‌లేక‌పోయింది. కానీ, వ్యూహాత్మ‌కంగా ఆయ‌న్ను ఏపీ సీఐడీ పోలీస్ అరెస్ట్ చేయ‌గ‌లిగింది. ఆ సంద‌ర్భంగా ఆయ‌న మీద థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని త్రిబుల్ ఆర్ ఆరోపిస్తున్నాడు. ఆ మేర‌కు సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశాడు. విచార‌ణ చేసిన త‌రువాత కొన్ని ఆంక్ష‌లు పెడుతూ ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఆనాటి నుంచి ఆంక్ష‌ల న‌డుమ త్రిబుల్ ఆర్ ఢిల్లీ నుంచి ర‌చ్చబండ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాడు. రెండున్న‌రేళ్లుగా సొంత నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నాడు. అక్క‌డి ఎమ్మెల్యేల‌తో ఆయ‌నకు రాజ‌కీయ వైరం ఉంది. న‌ర్సాపురం లోక్ స‌భ ప‌రిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తానూ చేస్తాన‌ని ప‌లుమార్లు స‌వాల్ విసిరాడు.

జ‌గ‌న్ స‌ర్కార్ మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని తాజాగా త్రిబుల్ కొన్ని స‌ర్వేల ద్వారా గ్ర‌హించాడు. ఇదే జ‌గ‌న్ పాల‌న పై చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపించ‌డానికి స‌రైన స‌మ‌యంగా ఆయ‌న భావిస్తున్నాడు. అందుకే, రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నాడు. సంక్రాంతి త‌రువాత రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆ లోపుగా అన‌ర్హ‌త వేటు వేయించ‌డానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని జ‌గ‌న్ కు స‌వాల్ విసిరాడు. చేత‌గాద‌ని అంగీక‌రిస్తే,రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ‌తాన‌ని డైరెక్ట్ అటాక్ చేశాడు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుంచి ప్ర‌తిస్పంద‌న రాలేదు. ఆ క్ర‌మంలో సంక్రాంతి సంద‌ర్భంగా భీమవ‌రం వ‌స్తోన్న త్రిబుల్ ఆర్ ను ఏపీ ప్ర‌భుత్వం ఎలా డీల్ చేస్తుందో..అనే అంశంపై ఉత్కంఠ నెల‌కొంది.
ప్రొటోకాల్ ప్ర‌కారం సిట్టింగ్ ఎంపీకి ఏపీ పోలీస్ భ‌ద్ర‌త క‌ల్పించాలి. పైగా సుప్రీం కోర్టు డైరెక్ష‌న్ కూడా ఉంది క‌నుక ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేయాలి. అందుకు భిన్నంగా ఏదైనా జ‌రిగితే, ఏపీ స‌ర్కార్ ఇర‌కాటంలో ప‌డుతుంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ పై థ‌ర్డ్ డిగ్రీ వ్య‌వ‌హారం చ‌ర్చ‌లో ఉంది. ఏదైనా జ‌రిగితే, దానికి ఇంకా ఆజ్యం పోసిన‌ట్టు అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ రెబ‌ల్ ఎంపీ పై ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తుందో..అనేది ఆస‌క్తిక‌ర అంశం. ఇక ఆయ‌న రాజీనామా చేస్తే ఏపీ పాలిటిక్స్ తారాస్థాయికి చేర‌తాయ‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.