ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు(త్రిబుల్ ఆర్) యూటర్న్ తీసుకున్నాడు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని సొంత నివాసం భీమవరం కు వస్తానని ప్రగల్భాలు పలికాడు. సంక్రాంతి షెడ్యూల్ ను ఢిల్లీ నుంచి మీడియాకు వెల్లడించాడు. భీమవరంలో చూసుకుందాం..రండి..అంటూ స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీ మార్గాని భరత్ కు సవాల్ చేశాడు. నిజంగా ఆయన వస్తే..ఎలా ఉంటోందోనని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, ఆయన ధైర్యం చేయలేకపోయాడు. పండుగ జరుపుకోవాలన్న కోరికను చంపుకున్నాడు. ఏపీ సీఐడీ రెండు రోజుల క్రితం ఇచ్చిన నోటీసులతో గప్ చిప్ అయ్యాడు.ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా త్రిబుల్ ఆర్ హడావుడి ప్రత్యేకంగా ఉండేది. సంక్రాంత్రికి గోదావరి జిల్లాల పరిధిలో వేసే కోడిపందెం స్పెషల్ అట్రాక్షన్. కొన్నేళ్లుగా ఆ పందాలను ఆపాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్వర్గీయ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సంప్రదాయంలో భాగమంటూ కోడి పందెంను ఆనాడు వైఎస్ లైట్ గా తీసుకున్నాడు. అప్పట్లో రఘురామక్రిష్ణంరాజు కోడి అంటే…పందెం రాయుళ్లకు క్రేజ్. బెట్టింగ్ లు కోట్ల రూపాయల్లో కట్టే వాళ్లు. పందెం కోళ్లకు కేంద్ర బిందువుగా త్రిబుల్ ఆర్ ఉండే వాడు. గోదావరి జిల్లాలన్నింటిలోనూ భీమవరం కోడి పందెం చాలా ఖరీదు. హెలికాప్టర్లపై పందెం రాయుళ్లు చేరుకునే వాళ్లు. అక్కడి తోటల్లో హెలిప్యాడ్ లను పందెం నిర్వాహకులు ఏర్పాటు చేయడాన్ని గతంలో చూశాం. ఈసారి రఘురామక్రిష్ణంరాజు హడావుడి అక్కడ లేదు. ఫలితంగా పందెం కోళ్లు ఉన్నప్పటికీ సాదాసీదాగా సంబరం కనిపిస్తోంది.
తెలంగాణ మంత్రులు కొందరు భీమవరం కేంద్రంగా సంక్రాంతి సంబురాలు జరుపుకుంటారు. వాళ్ల విడిది ఎక్కువగా త్రిబుల్ చూసుకునే వాడు. అతిథి గృహాల నుంచి గోదావరి వంటకాలు, పందెం కోళ్లు అన్నీ అక్కడే మంత్రులకు సమకూరేవి. ప్రతి ఏడాది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భీమవరంలో హడావుడి ఉండేది. విదేశాల నుంచి కూడా కొందర్ని త్రిబుల్ ఆర్ సంక్రాంతికి ఆహ్వానించే వాడు. ఈసారి పూర్తిగా సీన్ మారిపోయింది.ఢిల్లీ నుంచి కదలడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. భీమవరం వస్తే, ఏపీ సీఐడీ అరెస్ట్ చేస్తుందని ఆయన అనుమానం. చివరి నిమిషం వరకు షెడ్యూల్ కు అనుగుణంగా భీమవరం చేరుకోవాలని ప్రయత్నం చేశాడట. సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసే సీనియర్ అడ్వకేట్ లను వెంటబెట్టుకుని రావాలని సర్వశక్తులు ఒడ్డాడట. కానీ, వాళ్లు కూడా భరోసా ఇవ్వలేకపోయారని ఢిల్లీ వర్గాల టాక్. అందుకే, త్రిబుల్ ఆర్ తోకముడిచాడు.ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం భీమవరం చేరుకోవాలి. రెండు రోజులు పాటు అంటే ఆదివారం వరకు అక్కడే ఉండాలి. అవసరమైతే, రాజీనామాను కూడా అక్కడ నుంచే సంధించాలని యోచించాడు. అదే విషయాన్ని మీడియాకు చెబుతూ..సవాల్ విసిరాడు. చేతనైతే..రండి..ఏం చేస్తారో…చేయండి అంటూ జగన్ ను రెచ్చగొట్టాడు. ఆ దూకుడును చూసిన వాళ్లు త్రిబుల్ ఏదో చేయబోతున్నాడని ఆదుర్దాగా చూశారు. చివరకు ఏనుగు…డాష్ లాగా చేశాడు.ఇంత మాత్రానికి ప్రగల్భాలు అవసరమా? అంటూ సహచరులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. సో..ఈ సంక్రాంతికి త్రిబుల్ ఆర్ `ఎపిసోడ్` కూడా విడుదల కాలేదన్నమాట.