తెదేపా ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ అంశంపై మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. రఘురామకృష్ణరాజు పేరును డిప్యూటీ స్పీకర్‌గా ఖరారు చేసిన ముఖ్యమంత్రి, ఈ పదవికి సంబంధించి నోటిఫికేషన్ బుధవారం లేదా గురువారం మధ్య విడుదల చేయనున్నారు.
2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచిన రఘురామకృష్ణరాజు, కొద్ది కాలంలోనే ఆ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి, జగన్ ప్రభుత్వాన్ని ఎదురించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా “రచ్చబండ” పేరిట ఆయన చేసిన ఆరోపణలు, అవినీతిని బహిరంగంగా ఎండగట్టడం తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు ఇవ్వడం ఒక పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది.
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి, వైకాపా నేతలు రఘురామకృష్ణరాజును రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసారు. ఆయనపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీసులను కూడా దురుసుగా ప్రేరేపించారు. ఈ పరిస్థితిలో, రఘురామకృష్ణరాజు ఎక్కువ భాగం సమయం ఢిల్లీకి పరిమితమయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రఘురామకృష్ణరాజు తనపై గతంలో చిత్రహింసలు పెట్టిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మరియు పోలీసు ఉన్నతాధికారులును ప్రధాన నిందితులుగా చేర్చారు.
ఇదిలా ఉండగా, రఘురామకృష్ణరాజు జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు.
2024 ఎన్నికలకు ముందు, వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామకృష్ణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు.