Raghavulu : సీపీఎంకు దిక్సూచి లాంటి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కేది ఎవరికి అనే దానిపై ఇవాళ (ఆదివారం) క్లారిటీ రానుంది. ఈ కీలకమైన పోస్టు కోసం సీపీఎం సీనియర్ నేతల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రస్తుతం తమిళనాడులోని మదురైలో సీపీఎం 24వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలు వేదికగా ఈరోజు కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీ సారథి ఎవరో వెల్లడించనున్నారు. గత ఏడాది సీతారాం ఏచూరి కన్నుమూయడంతో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీ అయింది. దీంతో సీపీఎం తాత్కాలిక సమన్వయ కర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారత్(Raghavulu) వ్యవహరిస్తున్నారు. ఇక ఈసారి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీపడుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఎం అగ్రనేత బి.వి.రాఘవులు కూడా ఉన్నారు. కేరళకు చెందిన ఎం.ఎ.బేబీ, మహారాష్ట్రకు చెందిన అశోక్ ధవలే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ సలీంలు కూడా పోటీలో ఉన్నారు.
Also Read :Gold Rate: భారీగా తగ్గుతున్న గోల్డ్ రేటు.. కారణాలు ఏమిటంటే..?
ప్రధాన పోటీ ఆ ఇద్దరి మధ్యే..
అశోక్ ధవలే ప్రస్తుతం ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంఏ బేబీ గత 13 సంవత్సరాలుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. అందుకే ప్రధాన పోటీ అశోక్ ధవలే, ఎం.ఎ.బేబీ మధ్యే ఉందని అంటున్నారు. సీపీఎం ఫైర్ బ్రాండ్ బృందా కారత్‌ను జనరల్ సెక్రటరీగా చూడాలని మరికొందరు పార్టీ నేతలు భావిస్తున్నారు. 75 ఏళ్లు దాటిన నేతను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడదనే నిబంధనను సీపీఎం అమలు చేస్తోంది. అయితే అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనను పక్కనబెట్టే వీలుందని అంటున్నారు.
గతంలో ఏమైందంటే..
- 1996లో పశ్చిమబెంగాల్ నుంచి జ్యోతిబసు ప్రధానమంత్రి పదవికి అర్హుడని భావించిన వేళ, కేరళ వామపక్ష వర్గం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది.
- 2007లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలోనూ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదు.
- 2015లో సీతారాం ఏచూరిని ప్రధా న కార్యదర్శిగా ఎన్నుకుంటే ఆనాడు కేరళ ముఖ్యనేతలు ఎస్‌ఆర్ పిళ్లైకు మద్దతు పలికారు. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.