Site icon HashtagU Telugu

Chandrababu : నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ…

Babu Tvr

Babu Tvr

గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ పార్టీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిల్చుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. కీలక హామీలను ప్రకటిస్తూ..యువతతో పాటు పెద్దవారిలో భరోసా కలిపిస్తున్నారు. ఆదివారం తిరువూరులో జరిగిన ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..నిరుద్యోగ భృతిపై కీలక హామీ ఇచ్చారు.

నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నాతో సహా ప్రజలందరూ బాధితులేనని అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. ఇక్కడ అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం జగన్ రివర్స్ పాలనే అని ప్రజలు గుర్తించాలని చెప్పారు. ‘ఓ వ్యక్తి వల్ల ఓ రాష్ట్రం.. ఓ తరం ఇంతలా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓ అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు, అదే ఓ దుర్మార్గుడికి అధికారం అప్పగిస్తే తిరిగి కోలుకోలేని స్థితిలో నష్టపోతాం. ప్రజాస్వామ్యంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ అరాచక పాలనకు చరమ గీతం పాడాలి.’ అని పిలుపునిచ్చారు. అలాగే టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలందరికీ ‘మహాలక్ష్మి’ పథకం కింద నెలకు రూ.1500 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట’ సూపర్ సిక్స్ అందిస్తామని అన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని.. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ‘జయహో బీసీ’ కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ‘అన్నదాత’ కింద రైతులకు రూ.20 వేలు అందజేస్తామన్నారు. అంతకుముందు తిరువూరు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, తెలంగాణ సరిహద్దు కావటంతో.. ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వచ్చారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీగా వాహనాలతో నేతలు ప్రదర్శనగా సభాస్థలికి చేరుకున్నారు.

Read Also : KCR: కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహాన్